టిడిపి సీనియర్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది.కొద్ది రోజుల క్రితం పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను తెలుగుదేశం పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీలో తన మాటను చంద్రబాబు పట్టించుకోవడంలేదని, లోకేష్ చంద్రబాబు ఇద్దరూ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, సీనియర్ గా తనకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదంటూ బుచ్చయ్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధపడ్డ సంగతి తెలిసిందే.
అయితే బుచ్చయ్య వంటి సీనియర్ పార్టీకి దూరం అవడం వల్ల తలెత్తే నష్టమేమిటో చంద్రబాబుకి బాగా తెలుసు.అందుకే ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ముగ్గురుతో కమిటీని కూడా చంద్రబాబు వేశారు .వారు బుచ్చయ్యను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
అయితే ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో, ఎన్టీఆర్ భవన్ కు వెళ్ళిన బుచ్చయ్య చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాను ఎందుకు ఇంతగా అసంతృప్తికి గురయ్యాను అనే విషయాన్ని బుచ్చయ్య చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.బుచ్చయ్య వెంట పార్టీ సీనియర్ నాయకులు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నింటిపైనా చంద్రబాబుకు బుచ్చయ్య వివరించినట్లు తెలుస్తోంది.పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను అనేక సలహాలు, సూచనలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇకపై ఆ విధంగా జరగదని, , పార్టీలో మీకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.అయితే ఈ సందర్భంగా బుచ్చయ్య కొన్ని డిమాండ్లను విధించారట.త్వరలో పిఎసి చైర్మన్ పదవి ఖాళీ అవుతుందని, దానిని తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పయ్యావుల కేశవ్ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.ఆ పదవి పైన బుచ్చయ్య ఆశలు పెట్టుకున్నారు.అలాగే త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ లో జరగబోయే ఎన్నికల్లో తన మాటకు విలువ ఇవ్వాలని, తాను సూచించిన వారినే ఎంపిక చేయాలనే షరతు విధించారట.
దీంతో బుచ్చయ్య వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు అయ్యింది.