రెండు పార్టీలు కలిసి పొత్తుపెట్టుకుని ఎన్నికలలో ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ అధికారంలోకి రావాలని చూస్తున్నా, ఆదిలోనే ఎవరి దారి వారిదే అన్నట్లు గా వ్యవహరిస్తూ, పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నాయి.జనసేన బిజెపి.
పేరు కు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా, ఎవరికి వారు సొంత అజెండాతో ముందుకు వెళుతూ, కిందిస్థాయి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తూ వస్తున్నారు.బీజేపీ జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నాయి.
జనసేన తో బీజేపీ పొత్తు పెట్టుకున్న మొదటి రోజు నుంచే ఆ పార్టీపై నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూనే వచ్చింది.అలాగే బిజెపి అగ్రనాయకులు మోదీ, అమిత్ షా వంటి వారి దర్శన భాగ్యం కూడా పవన్ కు లభించలేదు.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి.అయినా ఎక్కడ ఆ సంతృప్తి బయటకు రాకుండా అంతా బాగానే ఉంది అని ఒకరినొకరు అభినందించుకున్నారు.
ఇదిలా ఉంటే రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ , జిల్లాల బాటపట్టారు అయితే ఎక్కడ బిజెపిని సంప్రదించకుండానే ఆయన ఈ వ్యవహారం నడపడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం గానే ఉన్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో నిన్న బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్న దుస్థితిపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.కానీ ఆ ఆందోళనలో ఎక్కడా జనసేన వర్గాలు కనిపించకపోవడంతో, ఈ రెండు పార్టీలు ఎవరి దారిలో వారే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నట్లు గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో బిజెపి జనసేన లో ఏ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని అనే విషయంపై మనస్పర్ధలు ఏర్పడినట్లు గా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా విడివిడిగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఈ రెండు పార్టీలు ముందుకు వెళుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది.