ఇప్పటివరకు ఆషామాషీగా రాజకీయాలు చేసినా, ఇకపై క్లారిటీతో రాజకీయాలు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్ర అధికార పార్టీ బిజెపి.ముఖ్యంగా తెలంగాణ, ఏపీ లలో బలపడేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఒక క్లారిటీ తెచ్చుకుంది.
తెలంగాణలో గతంతో పోలిస్తే బాగా బలపడ్డారు అనేది బిజెపి పెద్దల అభిప్రాయం.దీనికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనం అవుతుండడమే.
ఆ పార్టీ ఎంతగా బలహీనం అయితే అంతగా తమకు అవకాశం ఏర్పడుతుందని, ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా బిజెపి ఎదిగిందని కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది అనే నమ్మకంతో బిజెపి పెద్దలు ఉన్నారు.పూర్తిగా కాంగ్రెస్ ను బలహీన చేసే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించడంతో పాటు, కాంగ్రెస్ లోని కీలక నేతలు అందరిని బిజెపి లో చేర్చుకుని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి ప్రభావం స్పష్టంగా కనిపించింది అంటే, దానికి కారణం కాంగ్రెస్ బాగా బలహీనం కావడమే అనే విషయాన్ని బాగా నమ్ముతోంది.ఇక ఏపీలోనూ టిడిపి వంటి పార్టీలను టార్గెట్ చేసుకుని ఆ పార్టీని బలహీనం చేస్తే వైసిపికి ప్రధాన ప్రతిపక్షంగా తాము బల పడవచ్చు అని, జనసేన సహకారంతో అధికారం సాధించవచ్చు అనే లెక్కలు బిజెపి వేసుకుంటుంది.
అందుకే భవిష్యత్తులోనూ టిడిపితో పొత్తు ఉండదు అనే విషయాన్ని బిజెపి ప్రకటించేసింది.దీని ద్వారా టిడిపి ఎప్పటికీ బీజేపీకి శత్రువే అనే విషయం జనాల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుందని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనం అవుతుంది కాబట్టి, తమకు మంచి అవకాశం ఏర్పడుతుందని బిజెపి అంచనా వేస్తోంది.