కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం: ఈటెల రాజేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ సమాజం తిరగబడి కేసీఆర్ నియంత పాలనను తరిమి తరిమి కొడుతుందని బీజేపీ నేత,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో జిట్టా బాలకృష్ణారెడ్డి నిర్వహించిన తెలంగాణ అలయ్ బలయ్ కార్యక్రమానికి గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇతర ప్రముఖులు,ఈటెల రాజేందర్ హాజరైనారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అణిచివేతలను, బలిదానాలను, తిరుగుబాటులను చూసి పోరాడిన తెలంగాణ సమాజం నేడు చైతన్యవంతమైందన్నారు.ఆకలినైన భరిస్తుంది.

కానీ, ఆత్మగౌరవాన్ని మాత్రం తెలంగాణ సమాజం కోల్పోదన్నారు.తుఫాను వచ్చేముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో ప్రస్తుతం తెలంగాణ సమాజం అలాగే ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో, ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను,ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి కుటుంబ,అవినీతి పాలన సాగిస్తున్నాడన్నారు.ఉద్యమ సమయంలో జెండాలకు,కులాలకు, రాజకీయాలకు అతీతంగా సకల జనులు రాష్ట్ర సాధన కోసం సమ్మె చేశారని,బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో సకల జనులు కనీస హక్కులు, ఆత్మగౌరవం కరువై అరిగోస పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్ ఏరు దాటక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉద్యమాల వేదిక ధర్నా చౌక్ ఎత్తివేతతో తన ఫ్యూడల్ నైజాన్ని చాటుకుంటూ అణిచివేత రాజకీయాలు సాగిస్తున్నాడన్నారు.హక్కుల కోసం సమ్మేలకు దిగుతున్న ఉద్యోగ,కార్మిక సంఘాలను,ఆర్టీసీ కార్మికులను అణిచివేసి నా రాజ్యంలో సమ్మెలకు తావు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు.

ఒక చేత్తో రైతుబంధు ఇస్తూ మరో చేత్తో 30 రోజులపాటు ధాన్యం కొనకుండా,బస్తాకు ఇంత కోతలు పెడుతూ, రైతులను కుటుంబాలతో పాటు కొనుగోలు కేంద్రాలలోనే ఉండేట్లుగా కష్టనష్టాల పాలు చేస్తున్నారన్నారు.రైతు వేదికలతో ఏ పంట వేయాలో నిర్ణయిస్తామని చెప్పి వాటిని నిరుపయోగంగా మార్చివేశాడన్నారు.54 లక్షల మంది రైతులు,70 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్ అధికారమనే ఫీజు పీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.ఉద్యోగ పరీక్షలను నిర్వహించాల్సిన ప్రభుత్వమే పేపర్ల లీకేజీ బ్రోకర్ గా మారిందని, దీంతో ఉద్యోగాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి భూసేకరణలతో గత ప్రభుత్వాలు ఇచ్చిన దళిత,గిరిజన భూములను లాక్కుంటూ బడా కంపెనీలకు కట్టబెడుతూ,ధరణి పేరుతో భూ దోపిడి చేస్తుందన్నారు.రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు 105 కోట్లు కేటాయించి కలెక్టర్లను,అధికారులను కేసీఆర్ ప్రచారం చేసేలా ఉత్సవాల నిర్వహించాలని ఆదేశించడంతో గొర్రెల మాదిరిగా వారు ఉత్సవాలకు సిద్ధపడ్డారన్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన,ప్రజలను గౌరవించే,సకల జనులకు అభివృద్ధి ఫలాలు అందించే పాలన మాత్రమేనన్నారు.సమావేశంలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ అవినీతి కుటుంబ పాలన అంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా అంతా ఎన్నికల్లో ఒకే నిర్ణయం తీసుకొని కేసీఆర్ ను గద్దె దించాలన్నారు.

ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్,సచివాలయం నిర్మించుకొని ప్రజలను రానివ్వకుండా గడిల పాలన సాగిస్తున్న కేసీఆర్ గడిని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ మోడల్ అంటే ఐదు లక్షల కోట్ల అప్పు, లక్ష కోట్ల స్వాహా,కేసీఆర్ పాలన డప్పు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

Advertisement

దోచుకో దాచుకో అన్నట్లుగా తెలంగాణ మోడల్ తయారైందన్నారు.తెలంగాణలో నేడు నలుగురు కుటుంబ సభ్యులు వర్సెస్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలుగా పరిస్థితి ఉందన్నారు.ఉద్యమకారులంతా సిద్ధాంతాలకు అతీతంగా కేసీఆర్ నియంత పాలన అంతమే సిద్ధాంతంగా 10 లక్షల మందితో భారీ సభ నిర్వహించాలన్నారు.

బండి యాదగిరి పాటలో నైజాంను తీసేసి కేసిఆర్ సర్కారోడా అని అంతా పాడుకోవాలన్నారు.ఈ సభలో ఏపూరి సోమన్న కెసిఆర్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతు తన ఆటపాట మాటలతో సబికులను అలరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుదల నగేష్, తుల ఉమా,రాణి రుద్రమ, ఇన్నయ్య,పాశంయాదగిరి, బట్టు రామచందర్,బండ్రు శోభారాణి,నిర్మల, బందారపు లింగస్వామి, తుమ్మల యుగంధర్ రెడ్డి, చిలుకూరు సత్తిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Latest Yadadri Bhuvanagiri News