రాములమ్మ పై బీజేపీ పొగడ్తలు ? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ?

రాములమ్మ విజయశాంతి పొలిటికల్ ఫీచర్ ఏంటో ఎవరికి స్పష్టంగా అర్థం కావడం లేదు.ఆమె కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా, తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని,  పార్టీలోని సీనియర్ నాయకులు ఎవరు తనను పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారని, తనను ఏ సభలు , సమావేశాలకు పిలవడం లేదని ఆమె చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అలాగే దుబ్బాక ఎన్నికల ప్రచారానికి ముందు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరితోనూ సమావేశం నిర్వహించిన సందర్భంలోనూ విజయశాంతి కి ఆహ్వానం అందకపోవడం పై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దుబ్బాక ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగినా, ఆమె సైలెంట్ గా ఉన్నారు.కనీసం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు కూడా ఆమె ముందుకు రాలేదు.

దీంతో ఆమె బిజెపి లోకి వెళ్ళిపోతారు అనే ప్రచారం ఊపందుకుంది.దీనికి తగ్గట్టుగానే ఆమె కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో మంతనాలు చేసినట్లు ప్రచారం జరిగింది.

Advertisement

అయితే ఈ ప్రచారంపై, అప్పట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.తను విజయశాంతి తో మాట్లాడానని, ఆమె పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు.

అయినా, విజయశాంతి బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం సాగుతూనే వచ్చింది.ఇదే సమయంలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా ఓటు వేయాలంటూ కోరడంతో, విజయశాంతి అంతరంగం ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా అయ్యింది.

తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి ని పొగడ్తలతో ముంచెత్తారు.ఆమె ప్రజాదరణ ఉన్న మంచి నాయకురాలిగా, తెలంగాణ ఉద్యమం సమయంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారు అంటూ అదే పనిగా పొగడ్తల వర్షం కురిపించారు.

తెలంగాణ గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేశారని, కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని నిర్లక్ష్యం చేశాయి అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.దుబ్బాక ఎన్నికలు ముగియగానే ఆమె బిజెపిలో చేరుతారని ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఇప్పుడు సంజయ్ ఈ విధంగా వ్యాఖ్యానించడంపై ఆమె బిజెపి లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు