2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.అప్పుడే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
అన్ని కులాల మద్దతు పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి.కొన్ని ప్రధాన కులాల మద్దతు తమకు ఉంటే రాబోయే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదని, తప్పకుండా అధికారంలోకి రాగలము అనే ధీమా అన్ని రాజకీయ పార్టీలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో ఇప్పుడు కుల సంఘాలకు, ఆయా కులాలు ప్రముఖులు చాలామందికి ఎక్కడాలేని ప్రాధాన్యం పెరిగింది.అదే విధమైన పరిస్థితి ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఎదురైంది.
కాపుల మద్దతు పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.కాకపోతే ఎప్పటికైనా రాజ్యాధికారం సాధించాలి అని దిశగా కాపులు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
అయితే వారికి ముఖ్యమంత్రి పదవి తప్ప , అన్ని స్థానాల్లోనూ ప్రాధాన్యం దక్కుతూనే వస్తోంది.అయితే ఇప్పుడు విశాఖ కేంద్రంగా కొత్త రాజకీయ వేదిక తెరపైకి రాబోతుండడంతో అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి.
ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీ బాగా యాక్టిివ్ గా ఉంది.కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా వంగవీటి రంగా వారసుడైన వంగవీటి రాధాకృష్ణను ఇప్పుడు వైసీపీ తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి తెరతీసింది.
ప్రస్తుతం రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.

ఆయన వైసీపీలో చేర్చుకునేందుకు రాధాకృష్ణ స్నేహితులైన వైసీపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లను రంగంలోకి దించినట్టు గా కనిపిస్తున్నారు.తాజాగా వంగవీటి రాధా తో ఓ ఫంక్షన్ లో కొడాలి నాని, వంశీ భేటీ అయ్యారు.ఓ వైసీపీ నేత ఇంట్లో శుభకార్యానికి వంగవీటి రాధాకృష్ణ వెళ్ళగా , అదే సమయంలో మంత్రి నాని, ఎమ్మెల్యే వంశీ, రాధాకృష్ణ పక్కనే కూర్చుని మాట్లాడటం, దీనికి సంబంధించిన ఫోటోలు మీడియా, సోషల్ మీడియా లో వైరల్ కావడంతో రాధా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
వంగవీటి రాధా వైసీపీ లో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేందుకు సిద్దమనే సంకేతాలు కొడాలి నాని , వంశీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం తో వైసీపీ కాపులను ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.