అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయ్యింది అప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడలేని విమర్శలు పెరిగిపోయాయి.రావాలి జగన్ కావాలి జగన్ అంటూ పాటలు పాడుకుంటే ఇప్పుడు ఆ పాటలనే వినిపించి ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వైసీపీ నాయకులది.
ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం తమ అధినాయకుడు జగన్ వైకిరే కారణం అని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.జగన్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు.
ప్రజల కష్టాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు.నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు.
ప్రజలు కూడా జగన్ మీద నమ్మకంతో అత్యధిక సీట్ల మెజార్టీతో వైసీపీ ని గెలిపించారు.అధికారంలోకి వచ్చాక జగన్ తాను ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారిగా అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తప్పటడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

వాస్తవానికి జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమమే సంచలన ప్రకటనలకు కేంద్రమైంది.వరసగా డేట్లు ఫిక్స్ చేసి మరీ జగన్ పధకాలు ప్రారంభిస్తామని ఆ రోజు చెబుతూ ఉంటే హాజరైన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.సీఎంగా ప్రమాణం చేస్తూనే జగన్ ఓ మాట చెప్పారు.అదే రివర్స్ టెండరింగ్.అప్పట్లో ఆ పదం చాలా మందికి అర్ధం కాలేదు, కానీ మూడు నెలల కాలంలో అదే ఊతపదంగా మారడంతో దానిపైనే ఇపుడు అంతా చర్చగా ఉంది.ఆ రివర్స్ టెండరింగ్ తో అద్భుతాలు చేయబోతున్నామని జగన్ చెప్పారు.
కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి అది జగన్ కు ఇబ్బందులు తెస్తోంది.పోలవరం టెండర్లను రద్దు చేసేందుకు జగన్ మొండిగా వ్యవహరించాడు.
దీని మీద నవయుగ కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో జగన్ కు చుక్కెదురయింది.రద్దు ఉత్తర్వులను ఒక్క తీర్పుతో హైకోర్టు కొట్టేసింది.
ఇది వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామమే.

అమరావతి విషయంలోనూ వైసీపీ మంత్రులు ఇదే విధంగా వ్యవహరించి ఏపీలో అనవసర గందరగోళానికి తెర తీశారు.దీనిపై బీజేపీ కూడా ఘాటు విమర్శలు చేసింది.దీనిపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపించింది.
అలాగే పోలవరం టెండర్లను రద్దు చేయడం అంటే ప్రాజెక్ట్ పనులను మరింత ఆలస్యం చేయడమేనని అంతా భావిస్తున్నారు.కేంద్రంలోని జలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అయితే ఈ రద్దు మీద పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీడీపీ అయితే ఇది తుగ్లక్ చర్య అంటూ నాడూ నేడూ కూడా అంటోంది.అటు కేంద్రం ఇటు ప్రతిపక్షం అంతా వద్దు అంటున్నా ముందుకు వెళ్ళిన జగన్ కి హైకోర్టు రెడ్ సిగ్నల్ చూపించింది.
ఇలా ప్రతి విషయంలోనే జగన్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతూ అనవసర నిందలు మోయాల్సి వస్తోంది.అందుకే జగన్ దూకుడు తగ్గించి ఏపీలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా తన పరిపాలన చేయకపోతే ముందు ముందు మరిన్ని విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.
.