గోరంత దానం చేస్తూ కొండంత ప్రచారం పొందేవారి సంఖ్యకు కొదవే లేదు.కుడి చేత్తో దానం చేస్తే ఎడమచేతికి తెలియకూడదు అని పెద్దలు చెబుతున్న మాట.
అయితే ఇప్పుడు ఆ నియమాలు పాటించే వారు ఎవరూ లేరు.తాము చేస్తున్న అరకొర సహాయాన్ని కూడా గొప్పగా చూపించుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక ఈ విషయంలో రాజకీయ నాయకులు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాము చేసే చిన్న చిన్న ప్రచారం కూడా గొప్పగా చెప్పుకుని రాజకీయంగా ప్రజల్లోనూ, పార్టీలోనూ పలుకుబడి సాధించాలని చూస్తూ ఉంటారు.
గతంలో ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా వ్యవహారాలు చేయడం అత్యంత ప్రమాదకరం.ఎందుకంటే ఒకపక్క కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది.
ఈ సమయంలో సామాజిక దూరం పాటించడం అత్యవసరం.దీని కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
అయితే దీంట్లో రాజకీయ నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు కాస్త వెసులుబాటు కల్పించారు.
ఎవరు ఆకలితో అలమటించే కూడదనే ఉద్దేశంతో ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు వంటివి పంపిణీ చేస్తున్నారు.
అయితే ఇలా పంపిణీ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది.ఎందుకంటే ఫోటోలు వీడియోలు కోసమే నాయకులు తమ అనుచరులను వెంటబెట్టుకొని భారీ జన సమూహం తో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం ఏపీ లో కరోన వైరస్ వ్యాధి తీవ్రంగా ఉంది.ఈ సమయంలో సేవా కార్యక్రమాల పేరుతో నాయకులు సాయం పేరుతో వీధుల్లోకి రావడం, వాటి కోసం జనాలు గుంపులుగా రోడ్లమీదకు రావడం, ఏ ఒక్కరూ సామాజిక దూరం పాటించకపోవడం వంటివి జరుగుతున్నాయి.

ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.నాయకులు మాత్రం ఫోటోలకు , వీడియోలకు ఫోజులు ఇస్తూ మీడియాలో హైలెట్ అయ్యే విధంగా నాయకులు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు .పోలీసులు నాయకుల వెంట గుంపులు గుంపులుగా వెళ్తున్నా వారు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభం అవడతో ముస్లింలకు రంజాన్ సాయం పేరుతో నూ నాయకులు రోడ్ల మీదకు గుంపులు గుంపులుగా వస్తున్నారు.ఇలాంటి సమయంలో ఎంతో ఆర్భాటంగా పంపిణీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది.
అసలు లాక్ డౌన్ అమలవుతుందో లేదో పూర్తిగా పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు మంత్రులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఇటువంటి తరహా సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ నాయకులు ఏదో ఒక పేరుతో జనాల్లోకి వెళ్లడం, తాము చేస్తున్న అరకొర సాయాన్ని కేవలం ఫోటోలు, వీడియోలు పోజులు ఇచ్చే విధంగా చేస్తుండడం పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ కరోనా వ్యాప్తికి కారణం అవుతుండడం , నాయకులు చేస్తున్న తప్పిదాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావడం వంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.