పేరుకే తప్ప ప్రయోజనం ఏమీ లేదు అన్నట్లుగా ఏపీలో బీజేపీ పరిస్థితి ఉంది.చెప్పుకోవడానికి జనసేన పార్టీతో పొత్తు ఉన్నా, క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే విషయంలో బీజేపీ తడబాటుకు గురవుతోంది.
ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం తప్పించి, పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, అధికార పార్టీ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే విషయంలో కానీ, చొరవ తీసుకోలేకపోతుంది.దీనికితోడు పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండటం వంటి కారణాలతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
వరుసగా అన్ని ఎన్నికల్లోనూ బిజెపికి చుక్కెదురవుతోంది.ఒకపక్క చూసుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది.
టిఆర్ఎస్ పై నిరంతరం పోరాటం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను బయటకు తీస్తూ హడావుడి చేస్తున్నారు.
మొదట్లో తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, అక్కడి నాయకులు స్పీడ్ పెంచడం, జనాల్లో ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, అదే సమయంలో కాంగ్రెస్ సైతం బలహీన అవ్వడం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.
జిహెచ్ఎంసి దుబ్బాక ఎన్నికల్లో బిజెపి కి వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించాయి.ఇక ఈటెల రాజేందర్ వంటి వారు బీజేపీలో చేరిపోయారు.టిఆర్ఎస్ లో ఇమడలేని వారంతా ఇప్పుడు బీజేపీ బాట పడుతున్నారు.దీంతో 2023 ఎన్నికల నాటికి బిజెపి బలంగా పాతుకుపోయే పరిస్థితి ఉంది.
కానీ ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.

టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారు ఒక వర్గంగా ఉంటే, సోము వీర్రాజు ది మరో వర్గంగా ముద్ర పడింది.పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై సమన్వయం లేకపోవడం, చేరికలు కనిపించకపోవడం, జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో సక్సెస్ కాలేక పోవడం, ఇలా ఎన్నో అంశాలు ఏపీ బీజేపీకి శాపంగా మారాయి అనే వ్యాఖ్యలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.ఈ పరిస్థితిని గమనించే అధిష్టానం పెద్దలు సోము వీర్రాజు ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా హడావుడి నడుస్తోంది.