ఉద్యోగులకు ఎయిర్ ఇండియా షాక్..!

టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.తమ సంస్థలోని ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ని అమలు చేయడం ప్రారంభించింది.

ఈ విధానంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తీసి వేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోనుంది.నవంబర్ 2019 నాటికి, ఎయిర్‌ ఇండియాలో 9,426 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.55 ఏళ్లు పైబడిన శాశ్వత ఉద్యోగులు లేదా 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు వీఆర్ఎస్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.కానీ క్యాబిన్ క్రూ, క్లరికల్, అన్‌స్కిల్డ్ ఉద్యోగుల విషయంలో 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు కూడా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

వీఆర్‌ఎస్‌ని ఎంచుకునే ఉద్యోగులు ఎక్స్‌గ్రేషియా మొత్తంపై అదనపు ప్రోత్సాహకాన్ని పొందుతారని తాజా ప్రకటనలో ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది.జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు వారి రీజియన్ పర్సనల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌ని సంప్రదించాలని సంస్థ ఓ ప్రకటనలో కోరింది.

దీనిపై ఎయిర్ ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సురేష్ దత్ త్రిపాఠి పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. కంపెనీ వీఆర్ఎస్‌ని ప్రకటించినప్పుడు, అదే సమయంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ కూడా చేపట్టనుంది.

Advertisement

కోల్‌కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో క్యాబిన్ సిబ్బందికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.ఇంజినీరింగ్, నెట్‌వర్క్ ప్లానింగ్, రెవెన్యూ మేనేజ్‌మెంట్ వంటి ప్రత్యేక విభాగాలలో ఉద్యోగులను నియమిస్తోంది.

కీలక పోస్టుల్లో ఇప్పటికే నియామకాలు ప్రారంభమయ్యాయి.తక్కువ ధరకే విమానయాన టికెట్లు అందిస్తున్న స్పైస్‌జెట్‌ సంస్థలో ఇంజినీరింగ్ విభాగానికి నాయకత్వం వహించిన అరుణ్ కశ్యప్ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్‌గా చేరారు.

టాటా సంస్థల్లో కీలక ఉద్యోగాలలో ప్రతిభ చూపే ఎందరినో ఎయిర్ ఇండియాలో నియమిస్తున్నారు.పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమానికి నేతృత్వం వహించిన టీసీఎస్‌లో అనుభవజ్ఞుడు రాజేష్ డోగ్రా ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కస్టమర్ సర్వీసెస్, గ్రౌండ్ హ్యాండ్‌లింగ్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.టాటా డిజిటల్‌లో వ్యూహాత్మక కార్యక్రమాలను చూసే సత్య రామస్వామి ప్రస్తుతం ఎయిర్‌లైన్ చీఫ్ డిజిటల్, టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధిపతి ఆదిల్ నోషిర్ తంత్ర ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, కాల్ సెంటర్‌ను పునరుద్ధరించే ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.ఇలా కోర్ డిపార్ట్‌మెంట్‌ను మరింత పటిష్టంగా ఎయిర్ ఇండియా మార్చుతోంది.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు