నల్లగొండ జిల్లా: వివిధ నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు రోజువారీ భోజన ఖర్చుకు రూ.52 కేటాయిస్తున్న పాలకులు,దేశ భవిష్యత్ కు ఆధారమైన ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు రూ.36 కేటాయించడం సిగ్గుచేటని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నేతలు అసహనం వ్యక్తం చేశారు.హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, దుప్పట్లు,ట్రంకు పెట్టెలు,నోట్ పుస్తకాలు,ఇతర మౌలిక వసతులు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హాస్టల్ విద్యార్థులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించి,ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా విద్యార్ది సంఘం నేతలు మాట్లడుతూ ఎస్ఎఫ్ఐ,ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఆర్డీవో,ఎమ్మార్వోకి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకుండా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవడంతో ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని,లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.స్థానిక ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ సిబ్బందికి మరొకసారి వినతిత్రం అందజేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు కుర్ర జగన్,సైదానాయక్,జిల్లా ఉపాధ్యక్షుడు,దామరచర్ల మండల కార్యదర్శి వీర్ నాయక్,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.