యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న గొలుసు కట్టు చెరువులను గోదావరి జలాలతో నింపాలని మత్స్య సహకార సంఘాల రాష్ట్ర నాయకులు పిట్టల అశోక్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం వలిగొండ మండల కేంద్రంలోని పెద్ద చెరువును స్థానిక మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సోమనబోయిన సతీష్ ముదిరాజ్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మూసీ ప్రాంతంలోని చెరువుల్లో విషపూరిత కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల మత్స్య సంపద చనిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కాలుష్యానికి తోడు గుర్రపు డెక్క ఆకును తొలంగించడానికి మత్స్య కారులు వచ్చే ఆదాయంలో సగ భాగం ఖర్చు చెస్తున్నారని తెలిపారు.
గుర్రపు డెక్క ఆకును చంపడానికి డ్రోన్ లతో విషపూరిత రసాయనాలు స్ప్రే చేయడం వల్ల చేపలు చనిపోవడమే గాకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.మూసీ కాలుష్య జలాల వల్ల మత్స్యకారుల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.
ఈ కాలుష్యం వల్ల గ్రామీణ అభివృద్ధికి పట్టు గొమ్మలైన కుల వృత్తులు దెబ్బ తింటున్నాయని ముఖ్యంగా గౌడ,రజక, కుమ్మరి కుల వృత్తుల వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉన్నదన్నారు.
జిల్లాలోని పాడి,పంటలకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందని దీనితో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
కుల వృత్తిదారులు, రైతులు ఉపాధి కోల్పోయి పట్నం వలసలతో ఈ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాదాద్రి భువనగిరి జిల్లా చెరువులను గోదావరి జలాలతో నింపె ప్రాజెక్టు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు రాస వెంకట్ ముదిరాజ్,బుంగమట్ల కిష్టయ్య,మాటురీ క్రిష్ణ, ఎర్రబోలు జంగయ్య, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.







