దివ్వెల పండుగ దీపావళికి అమెరికా ముస్తాబయ్యింది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.
వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయుల ద్వారా మన పండుగలు, ఆచార వ్యవహారాలు అక్కడికి కూడా వెళ్తున్నాయి.ఇక అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.
అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.
ఇక వెలుగుల పండుగకు అమెరికాలో అరుదైన గుర్తింపు దక్కింది.
ఇకపై దీపావళిని పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్.అయితే ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న ఈ డిమాండ్‌పై నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకున్నట్లు ఆడమ్స్ పేర్కొన్నారు.తద్వారా న్యూయార్క్ నగర ఏకత్వంపై సందేశం ఇచ్చినట్లు అయ్యిందని.పిల్లలు కూడా దీపావళి గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని మేయర్ తెలిపారు.
ఇదిలావుండగా… ఈ ఏడాది కూడా దీపావళిని అమెరికాలో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో దివాళీ వేడుకలు ప్రారంభమయ్యాయి.అటు భారత సంతతి చెందిన , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన నివాసాన్ని అందంగా ముస్తాబుచేశారు.
మట్టిప్రమిదల దీపాలతో పాటు రంగు రంగుల విద్యుద్దీపాలతో ఆమె అధికారిక నివాసం కాంతులీనుతోంది.శుక్రవారం కమలా హారిస్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో భారతీయ అమెరికన్ ప్రముఖులు, దౌత్యవేత్తలు , ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అతిథులకు భారతీయుల ఫేవరేట్ పానీపూరి నుంచి సాంప్రదాయ స్వీట్లను వడ్డించారు.
ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ… దీపావళి అనేది సంస్కృతులకు అతీతమైన విశ్వవ్యాప్త భావన అన్నారు.చీకటిలో వెలుగును ప్రసరింపజేయడం అనే ప్రేరణ పొందేందుకు దివాళిని జరుపుకుంటారని ఆమె చెప్పారు.అనంతరం అందరికీ దీపావళి శుభాకంక్షలు తెలిపి.
క్రాకర్స్ కాల్చారు కమలా హారిస్ దంపతులు.