కరోనా వైరస్ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.కొన్ని కంపెనీలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమలను సైతం మూసివేశారు.
అలాంటి కష్ట కాలంలో కొందరు తమదైన శైలిలో ఆలోచించి కొత్త ఉపాధి మార్గాలు సృష్టించుకున్నారు.కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది.
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్‌కు చెందిన అమర్ ప్రజాతి అనే 15 ఏళ్ల వయసుగల ఒక యువకుడు ఒక వినూత్న ఆలోచన చేసాడు.కోవిడ్ కష్ట కాలంలో ఎల్ఈడీ బల్బులు, ల్యాంపులు తయారు చేయడం ప్రారంభించాడు.
ప్రస్తుతం అమర్ 12 రకాలకు పైగా బల్బులను మార్కెటింగ్ చేస్తూ మరో పదిమందికి కూడా ఉపాధి కల్పిస్తున్నాడు.అమర్ తండ్రి గోరఖ్ పూర్ పారిశ్రామిక అభివృద్ధి అధారిటీ(జీఐడీఏ)లో క్యాషియర్ గా పనిచేస్తున్నారు.
అమర్ కు 9వ తరగతి చదువుతున్న సమయంలోనే వినూత్న ప్రయోగాలు చేయాలంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టమే అమర్ ని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టింది.
అమర్ తాను సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.గత కొన్నేళ్లుగా ఎల్‌ఈడీ బల్బులకు బాగా డిమాండ్ పెరగడం గమనించి తాను కూడా ఎల్ఈడీ బల్బుల తయారీపై దృష్టి పెట్టానన్నారు.
ఇందుకోసం ఇంటర్నెట్ సహాయంతో పలు రకాల విషయాలను తెలుసుకున్నానన్నారు.
ఎల్ఈడీ బల్బుల తయారీలో ప్రత్యేక శిక్షణ తీసుకుని తన తండ్రి స్నేహితుని సాయంతో బల్బుల తయారీని మొదలుపెట్టానని తెలిపాడు అమర్.

ఢిల్లీ నుంచి ముడి సరుకు తీసుకువచ్చి, ఇంటిలోని ఒక గదిలో ఉంచి బల్పుల ఉత్పత్తికి వినియోగించామన్నారు.తమ స్టార్టప్‌కు జీవన్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరును కూడా రిజిస్ట్రర్ చేయించామన్నారు.ఇకపోతే 2020 నుంచి ప్రొఫెషనల్ లెవెల్‌లో ఎల్ఈడీ బల్బుల ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు.ఇలా ఇంటిలోనే బల్బులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు అమర్.నిజంగా 15 ఏళ్ల యువకుడు చేసిన ఈ ఆలోచన ఇప్పుడు వాళ్ళకి ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది.యువకులు మంచిగా ఆలోచిస్తే గొప్ప విజయాలు సాధిస్తారు అనడానికి అమర్ ఒక ఉదాహరణ.