అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా), బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన ‘‘స్పేస్ ఎక్స్’’ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయల్దేరారు.
స్థానిక కాలమానం ప్రకారం.బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.కక్ష్యలో సుమారు 22 గంటల ప్రయాణం తర్వాత వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు.
క్రూ-3 మిషన్‌కు భారత సంతతికి చెందిన రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తుండటం మనందరికీ గర్వకారణం.ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్‌మెరైన్ అధికారి కేలా బారన్, నాసాకు చెందిన టామ్ మార్ష్‌బర్న్, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మత్తియాస్ మౌరర్ మిషన్ కూడా అంతరిక్షంలోకి వెళ్లారు.వీరు దాదాపు ఆరు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు.నిజానికి రెండు వారాల క్రితమే అక్టోబర్ 31న ఉదయం 11.51కి ‘‘క్రూ-3 ’’ ప్రయోగం జరగాల్సి ఉండగా.వాతావరణ పరిస్థితులు, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులు, తదితర కారణాలతో ఆలస్యమైంది.
మరోవైపు కోవిడ్ నిబంధనలతో పాటు స్టాండర్డ్ లాంచ్ ప్రోసీజర్‌ను అనుసరించి ఈ మిషన్‌లో పాల్గొంటున్న వారిని అక్టోబర్ 16 నుంచి క్వారంటైన్‌లో వుంచారు అధికారులు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాములు కోవిడ్ బారినపడకుండా వుండేందుకే వీరిని క్వారంటన్‌లో వుంచినట్లు నాసా తెలిపింది.క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నలుగురు వ్యోమగాములకు రెండు సార్లు కోవిడ్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
ఎవరీ రాజాచారి:

మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు.యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది.కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్ మిషన్‌కు కూడా అర్హత సాధించినట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల్లో ఆయన కూడా ఒకరు.
మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.
ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్‌లోనే గడిచింది.యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్‌గా విశేషమైన అనుభవం వుంది.
ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.
మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.అనంతరం మేరీల్యాండ్‌లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.