2016 అధ్యక్ష ఎన్నికల్లో దొంగ ఓటు వేసినందుకు గాను ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది.ఈ కేసుకు సంబంధించి మలేసియాకు చెందిన 58 ఏళ్ల బైజూ పోటాకులత్ థామస్‌తో పాటు 11 మంది విదేశీ పౌరులపై గత నెలలో నార్త్ కరోలినాలోని మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు మోపారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో వీరు తమను తాము అమెరికా పౌరులుగా చెప్పుకుని చట్టవిరుద్ధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ కేసులో దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా ఓ ఏడాది జైలు శిక్ష, 10,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం వుందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ), హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ (హెచ్ఎస్ఐ) తెలిపాయి.
అమల్లో వున్న నిబంధనల ప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి, ఓటు వేయడానికి అమెరికా పౌరసత్వం లేని వారు అనర్హులు.ఇదే కేసులో భారత సంతతికే చెందిన రూబ్ కౌర్ అటార్ సింగ్ (57)పైనా అభియోగాలు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో ఫెడరల్ ఏజెన్సీలు గత కొన్నేళ్లుగా దర్యాప్తును నిర్వహిస్తున్నాయి.
అమెరికా పౌరసత్వాన్ని తప్పుగా క్లెయిమ్ చేయడం, ఓటరు నమోదు దరఖాస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, 2016 అధ్యక్ష ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా ఓటు వేసినందుకు గాను అటార్ సింగ్‌పై అభియోగాలు మోపారు.
ఈ కేసులో నేరం రుజువైతే అతినికి గరిష్టంగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష, 3,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.