యూకేలో భారత విద్యార్ధి మృతి: కడసారి చూపు దక్కించండి.. కేంద్రానికి తల్లిదండ్రుల వినతి

ఇంగ్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం దేశం కానీ దేశం వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన సిద్ధార్ధ్ ముర్కుంబి ఉన్నత విద్యను అభ్యసించడానికి యూకే వెళ్లాడు.అక్కడి సెంట్రల్ లాంక్‌షైర్ వర్సిటీలో చదువుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో మార్చి 15న సిద్ధార్ధ్ అదృశ్యమయ్యాడు.ఈ విషయాన్ని స్థానిక అధికారులు, అతని మిత్రులు భారత్‌లోని సిద్ధార్థ్ కుటుంబానికి తెలిపారు.

మిత్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 20 రోజులుగా అతని జాడను కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఈ క్రమంలో రిబ్సల్ నది ఒడ్డున స్థానిక పోలీసులు సిద్ధార్ ముర్కుంబి మృతదేహాన్ని కనుగొన్నారు.

Advertisement

కొడుకు ఆచూకీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అతని తల్లిదండ్రులు సిద్ధార్ధ్ మరణవార్తను విని కుప్పకూలిపోయారు.ఇదే విషాదం అనుకుంటే ఇప్పుడు కన్నబిడ్డ కడసారి చూపైనా దక్కుతుందా లేదా అన్న ఆవేదన వారిని ఇంకా బాధిస్తోంది.

కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉండటంతో సిద్ధార్థ్ మృతదేహం ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు రావడం కష్టసాధ్యం.

లాక్‌డౌన్, ఇతర ఆంక్షలను ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియకపోవడంతో సిద్ధార్థ్ మృతదేహాన్ని రాయల్ ప్రిస్టన్ ఆసుపత్రిలో భద్రపరిచారు.తమ కుమారుడిని కడసారి చూసుకునే అవకాశం కల్పించాల్సిందిగా అతని తల్లిదండ్రులు భారత్, యూకే ప్రభుత్వాన్ని కోరారు.మరోవైపు సిద్ధార్థ్ మరణానికి కారణం ఏమిటా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్ తీవ్రత పెరగటంతో వైద్యులు ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు