వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత స్థాయిలో ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది.అసలు ఆ కార్యక్రమాలు అమలు సాధ్యం కాదంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసినా వాటిని అమలు చేసి జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నాడు.
ఇక నిరుద్యోగుల కష్టాలను తీర్చేందుకు వరుస వరుస గా భారీ నోటిఫికేషన్ విడుదల చేసి అతి తక్కువ సమయంలోనే ఫలితాలను వెల్లడించింది వైసీపీ ప్రభుత్వం.వారికి వెంటనే నియామక పత్రాలు కూడా అందజేశారు.
ఇదంతా గొప్ప విషయం చెప్పుకోవాలి.అయితే ఇటువంటి గొప్ప విషయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో వైసిపి నాయకులు ఘోరంగా వెనకబడి పోతున్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఆ పార్టీ నేతలు మాత్రం పార్టీ అనుకూలతలను ప్రజల్లోకి బలంగా తీసుకోలేకపోతున్నారు.ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి కంటే ముందంజలో ఉంది.

ప్రభుత్వం ఎన్ని పథకాలు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చినా వాటికి క్రేజ్ రాకుండా విమర్శలు చేస్తూ, ఆ విమర్శలు ప్రజల్లోకి వెళ్లేలా ఒక చక్కటి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తోంది.జగన్ కు సొంత మీడియా ఉన్నా ప్రభుత్వ అనుకూలతలు పెద్దగా హైలెట్ కాలేకపోతున్నాయి.ఇదే విషయంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముందంజలోనే ఉంది.వారి పార్టీ గురించి అనుకూలంగా చెప్పుకోవాలన్నా, ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకు పడాలన్నా అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతుంటారు ఆ పార్టీ నాయకులు.
తెలుగుదేశం పార్టీ వాయిస్ ను రకరకాలుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లి మద్దతు కూడగట్టుకుంటూ ఉంటారు.దీనికోసం టిడిపి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక బృందం పని చేస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి నాయకులకు ఆదేశాలు వస్తూ ఉంటాయి.ఏ నాయకుడు ఏ విషయం గురించి మాట్లాడాలో దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా అక్కడి నుంచే సదరు నాయకులకు అందుతూ ఉంటుంది.
కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి ఇప్పటికీ లేదు.

వైసిపి నాయకులు తెలుగు దేశం మీద విరుచుకుపడినా అదంతా అంతంతమాత్రంగానే ఉంటోంది.పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది.అధికారికంగా ప్రెస్ మీట్ లు పెట్టే వైసీపీ నాయకులూ తూతూ మంత్రంగా మాట్లాడేస్తూ పైపైన తేల్చేస్తున్నారు.
ఈ విషయంలో జగన్ మీడియా సలహాదారుగా నెమ్మదిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.తమ పార్టీ ఎంత చేసినా అది ప్రజలకు చెప్పుకోవడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేకపోతోంది.
ప్రత్యర్థులు తమ మీద చేసిన విమర్శలు చేసిన అదంతా తమకు పట్టనట్టు గానే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని చూసి వైసీపీ చాలా నేర్చుకోవాల్సి ఉందన్నట్టుగా కనిపిస్తోంది.