మొత్తానికి కర్ణాటక లో జెండా ఎగురవేయాలి అని అనుకున్న బీజేపీ పార్టీ టార్గెట్ ను దిగ్విజయంగా రీచ్ అయ్యింది.గత కొంత కాలంగా కర్ణాటక లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.
అక్కడ ఏర్పడిన కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం నెలకొరగడం తో నిమిషాల్లో అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప నాలుగోసారి ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అయితే విధాన సౌధలో ఈ రోజు ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు.అయితే ఈ విశ్వాస పరీక్షలో యడ్డీ సునాయాసంగా విజయం సాధించినట్లు తెలుస్తుంది.
మ్యాజిక్ ఫిగర్ ను దాటి మరీ ఆయన విజయాన్ని అందుకున్నట్లు సమాచారం.మూజువాణి పద్దతిలో యడ్యూరప్ప సర్కార్ మ్యాజిక్ ఫిగర్ అయిన 104 ఓట్ల కంటే మరో రెండు ఓట్లు అత్యధికంగా సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ వెల్లడించారు.
దీంతో కర్ణాటకలో గత కొద్దీ కాలంగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడినట్టయింది.

ఈ విశ్వాస పరీక్షకు ముందు యడ్యూరప్ప కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘జరిగిందంతా మరచిపోతా.అందరినీ క్షమిస్తా.
నన్ను వ్యతిరేకించిన వారిని కూడా ప్రేమిస్తా’ అని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.నేను సిద్దరామయ్య,కుమారస్వామి లలాగా కక్ష పూరిత రాజకీయాలు చేయను అని,అందరిని క్షమిస్తాను అంటూ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
అలానే కరువుతో అల్లాడుతున్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇక ఇప్పుడు కర్ణాటక లో బీజేపీ పార్టీ ప్రభుత్వం అక్కడి ప్రజలను నడిపించబోతుంది అన్నమాట.







