అతని వయసు 11 ఏళ్లు.ఏడో తరగతి చదువుతున్నాడు.
అయితే మాకేంటి అనుకుంటున్నారా? మాములోడు అయితే మనకు అవసరం లేదు.కానీ ఈ బాలుడు సమ్‌థింగ్ స్పెషల్.
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది.స్కూల్ వెళ్లి పాఠాలు వినాల్సిన వయసులో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యాని గురిచేస్తున్నాడు.

ఉదయాన్ని 8 గంటలకు స్కూల్‌కు వెళ్తాడు.మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వస్తాడు.కాసేపు ఆడుకుంటాడు.అందరి విద్యార్థులు ఇదేగా చేసేది అనుకుంటున్నారా? కానీ సాయంత్రం 6 గంటలు అయిందంటే చాలు… మహ్మద్ హసన్ అలీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది.ఆ టైమ్‌కు మిగతా విద్యార్థులు ట్యూషన్‌కు వెళ్తే మహ్మద్ హసన్ అలీ మాత్రం తన ఇన్‌స్టిట్యూట్ తెరుస్తాడు.ఇన్‌స్టిట్యూట్ ఏంటా అనుకుంటున్నారా? అది కంప్యూటర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్.తన స్కూల్ పిల్లలకు కంప్యూటర్ క్లాసులు బోధిస్తాడేమో అనుకుంటే పొరపాటే.అతని దగ్గర కోచింగ్ కోసం వచ్చేవాళ్లంతా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు.ఈ ఏడో తరగతి విద్యార్థి దగ్గర డిజైనింగ్, డ్రాఫ్టింగ్ లాంటి పాఠాలు నేర్చుకుంటారు.ఇదీ హైదరాబాదీ హసన్ అలీ టాలెంట్.

అతని దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కూడా మా బుల్లి మాస్టార్ చాలా గ్రేట్ అని చెబుతున్నారు.అతడు చెప్పే విధానం కూడా ఈజీగా, అందరికి అర్ధమయ్యేలా ఉంటుందంటున్నారు.అయితే ఇలాంటి ఐడియా, ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందని ఈ బుల్లి మాస్టారుని అడిగితే.తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటూ ఇతరులకి నేర్పిస్తున్నాను అని చెప్పాడు.‘ నేను ఇంటర్నెట్‌లో ఓ వీడియో చూశాను.భారతీయులు ఇతర దేశాలకి వలస వెళ్లి కష్టమైన పనులు చేస్తున్నారు.
పెద్ద చదువులు చదివిన వారు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు.మన దగ్గర లక్షల మంది ఇంజనీరింగ్ చేస్తున్నప్పటికి వారికి ఉద్యోగాలు రావడంలేదు.
వారికి టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే విదేశాల్లో ఉద్యోగాలు రావడం లేదని అర్ధమైంది.దీంతో నా దృష్టి డిజైనింగ్ వైపు మళ్లింది.
అప్పటి నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్నది బోధించడం మొదలు పెట్టాను.గత ఏడాది నుంచి పాఠాలు చెబుతున్నాను.
బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు పాఠాలు బోధించే హసన్ అలీ… వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ ఇంటీరియర్ డిజైన్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు.అక్కడ మూడు రౌండ్ల ప్రాక్టికల్, 2డీ, 3డీ పోటీలు జరిగాయి.హసన్ అలీ మొదటి బహుమతి గెలుచుకున్నాడు.నేర్చుకోవడంతో పాటు పాఠాలు బోధించడమంటే తనకు ఇష్టమంటున్నాడు హసన్ అలీ.అతని కుటుంబ సభ్యుల నుంచీ ప్రోత్సాహం ఉంది.30 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇతని ఇన్‌స్టిట్యూట్‌లో వేర్వేరు కోర్సుల్లో జాయిన్ అయ్యారు.
అంత మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడానికి వస్తున్నారంటే… ఈ వయస్సులోనే హసన్ అలీ బాగా సంపాదిస్తున్నారని అనుకుంటే అతడి గురించి తక్కువ అంచనా వేసినట్టే.ఎందుకంటే… తన దగ్గర కోర్సులో చేరినవారి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోడు హసన్ అలీ.అందరికీ ఉచితంగానే పాఠాలు బోధిస్తున్నాడు.