సూర్యాపేట జిల్లా:మునగాల మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య,ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతీ ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి,సాధారణ ప్రసవాలు పెంచడానికి ఆరోగ్య కార్యకర్తలు మరియు సిబ్బంది కృషి చేయాలని కోరారు.
సిబ్బంది గ్రామగ్రామాన సాధారణ కాన్పులపై అవగాహన పెంచాలని,మొదటి కాన్పు సాధారణ ప్రసవం ఐతే రెండవ కాన్పు కూడా సాధారణ ప్రసవం అవడానికి అవకాశం ఉంటుందన్నారు.సిజేరియన్ ఆపరేషన్ ద్వారా తల్లికి రాబోయే రోజులలో తీవ్ర నష్టం ఉంటుందని,కావునా ముహూర్తాలు పెట్టుకోవడం లాంటి మూఢనమ్మకాలు మానేయాలని ప్రజలను కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.కాన్పులు ఇంటి వద్ద చేయడం అత్యంత ప్రమాదకరమని,ఆసుపత్రులలో సుఖ ప్రసవాలు చేయించుకోవాలని అన్నారు.
గర్భిణీ స్త్రీలు సాధారణ కాన్పు కొరకు ప్రతి రోజు కనీస వ్యాయామం చేయాలని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులలో బీపీ, షుగరు ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని,తల్లి,పిల్లల ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.క్యాన్సర్ అనుమానితులకు హుజూర్ నగర్,కోదాడ మరియు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నోటి క్యాన్సర్,బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ల పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని,ఆశ కార్యకర్తల ద్వారా ఇంటివద్దకే మాత్రలు ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.తరుచుగా బీపీ,షుగర్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
అందరి వివరాలు ఆల్లైన్ లో నమెదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి,ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ,జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్,జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భాస్కర రాజు,ఎన్ సి డి కోఆర్డినేటర్ భూతరాజు సైదులు,ఆర్.వినోద, డి.
నరసింహ,హెల్త్ అసిస్టెంట్లు లింగం రామకృష్ణ, కె.లింగయ్య,వై.మధుబాబు,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.