కర్ణాటకలో రాజకీయం నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది.క్షణంక్షణం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయినా బీజేపీ శాసన సభపక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగలిగారు.అయితే బలనిరూపణకు గవర్నర్ వాజూభాయ్‌వాలా పదిహేను రోజుల గడువు ఇచ్చారు.
అయితే అనూహ్యంగా బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది.మరో ఏడాదిలో పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవడం అంతసులువు కాదనీ, ఒకవేళ అలాచేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనీ, అది సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కమలం నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మరోవైపు గతంలో కర్ణాటకలో, దేశరాజకీయాల్లో జరిగిన పలు కీలక పరిణామాలను పరిశీలిస్తే బీజేపీకి రెండుమూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.2008లో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో బీజేపీకి మూడు సీట్లు తక్కువ వచ్చాయి.అప్పుడు జేడీఎస్‌కు చెందిన నలుగురిని, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించారు.
దీంతో సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన సంఖ్య తగ్గిపోయింది.
ఇక ప్రస్తుతం బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి.అయితే రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు.
ప్రస్తుత సభ్యుల సంఖ్యను 222 నుంచి 207కి తగ్గించగలిగితే బీజేపీ గట్టెక్కినట్టేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆ మేరకు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా అయినా చేయించాలి లేదా.
వారిని బలనిరూపణ సమయంలో ఓటింగుకు దూరంగానైనా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
ఇక్కడ రాజకీయ విశ్లేషకులు మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.1996లో వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే బీజేపీ అప్పుడు తగిన సంఖ్యాబలం లేదు.
అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆయన తన పదవిని వదిలేయాలని నిర్ణయించుకుని, నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు.
ఇప్పుడు కూడా బలం నిరూపించుకోలేని పరిస్థితుల్లో యడ్యూరప్ప కూడా వాజ్‌పేయి మార్గాన్నే ఎంచుకుని పదవీ త్యాగం పేరుతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచి పావులు కదుపుతోంది.
ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.