డప్పు రమేష్ కి విప్లవ నివాళి

సూర్యాపేట జిల్లా:విప్లవ రాజకీయ నిబద్దత గల సాంస్కృతిక యోధునిగా,సాంఘిక వివక్షతా వ్యతిరేక గొంతుగా,ముఖ్యంగా డప్పు కళాకారునిగా కళ కళకోసం కాదని,కళ ప్రజల కోసమని నినదించి, ఆచరించిన మహోన్నత ప్రజా కళాకారుడు కామ్రేడ్ డప్పు రమేష్ అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్,సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ,బహుజన కమ్యూనిస్టు పార్టీ (బిసిపి)జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య,దళిత బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు నారగోని వెంకట్ యాదవ్ లు అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డప్పు రమేష్ సంస్మరణ సభలో ఆయన మృతికి ఆయా జిల్లా కమిటీల తరుపున విప్లవ నివాళి అర్పిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైన కామ్రేడ్ రమేష్ చివరి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం నిబద్ధంగా నిలిచాడని కొనియాడారు.జననాట్య మండలి కళాకారుడిగా,విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్తగా, ఆర్గనైజర్ గా,నాయకునిగా ఎదిగాడని,అదే విధంగా సాంఘిక వివక్షత,అణచివేతలకి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ వచ్చాడని,బహుభాషా గాయకునిగా సైతం ఎదిగాడని,విప్లవమే ప్రాణంగా తుదివరకు జీవించాడని గుర్తు చేశారు.

తానే డప్పుగా, డప్పే తానుగా మారి,ఏకంగా డప్పును తన ఇంటి పేరుగా మార్చుకొని ప్రజల గుండెల్లో డప్పు రమేష్ గానే స్థిర స్థాయిగా నిలిపోయారని అన్నారు.కళను కూడా పాలకులు మార్కెట్లో అతి ఖరీదైన సరుకుగా మార్చే కాలంలో కూడా కామ్రేడ్ రమేష్ ప్రదర్శించిన నిబద్దత ఆదర్శప్రాయమని,పరాయీకరణ ప్రమాదం నుండి ప్రజాకళల్ని రక్షించే రాజకీయ కర్తవ్యానికి,ప్రగతిశీల, ప్రజాతంత్ర,విప్లవ సాంస్కృతిక,సాహిత్య సంస్థలకు కామ్రేడ్ రమేష్ జీవితం సదా మార్గదర్శకమని తెలిపారు.

ముఖ్యంగా ఫాసిస్టు ప్రమాదం పెరుగుతున్న నేటి కాలంలో విప్లవ సాంస్కృతికోద్యమం అవసరం నానాటికీ మరింత పెరుగుతోందని,ఈ క్లిష్టకాలంలో రమేష్ మృతి విప్లవోద్యమానికి తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో భానుప్రసాద్,చిట్టిబాబు, కునుకుంట్ల సైదులు,వెంకటేష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

తాజా వార్తలు