చలికాలంలో మన చర్మాన్ని రక్షించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల చర్మం కూచించుకుపోతుంది.
ముఖంపై చర్మం పొడిగా మారి పగిలిపోతుంది.ఇలాంటి సౌందర్య సమస్యలకు ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.
ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
మన కిచెన్ లో ఎప్పుడూ కనిపించే కోడిగుడ్డు పోషక ఆహారంగా మాత్రమే కాదు మాయిశ్చరైజింగ్ పదార్థంగా కూడా పనిచేస్తుంది.
అయితే గుడ్డులోని పసుపు సొన మాత్రమే ఒక గ్లాసులోకి తీసుకోవాలి.దానికి ఒక చెంచా నిమ్మరసం, పావు టీ స్పూన్ సముద్రపు ఉప్పు, రెండు చుక్కల అవకాడో కలపాలి.
తర్వాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.తర్వాత దాన్ని ఒక చెంచా బేబీ ఆయిల్ తో కలిపి ముఖంపై ఐదు నిమిషాలు పాటు మర్దన చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని చర్మంపై ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచుకుని ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం ద్వారా మీ చర్మం చాలా మృదువుగా తయారవుతుంది.

ఒకవేళ కోడి గుడ్డుసొన వాడకూడదు అనుకున్నవారు కలబంద తో కూడా మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు.ఇందుకోసం రెండు చెంచాల కలబంద గుజ్జులో రెండు చెంచాల తేనె, బాదం నూనె కలపాలి.మిశ్రమాన్ని ముఖానికి మెడపై మర్దన చేయాలి.30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు మీ ముఖం మృదువుగా తయారై మెరుపులీనుతుంది.

కొబ్బరి నూనె కూడా పొడిబారిన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఒక చెంచా కొబ్బరినూనెలో ఒక చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు మర్దన చేయాలి.ఆ మిశ్రమం మీ ముఖం పై అరగంట ఆరనివ్వాలి.తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కుంటే ముఖం తేమగా తయారవుతుంది.అరటిపండు గుజ్జు, రెండు చెంచాల తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం ద్వారా కూడా చర్మం తేమగా మారుతుంది.అసహజమైన మాయిశ్చరైజర్ కంటే సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.