2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి తప్పకుండా వస్తుందనే ధీమా తో ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ఉన్నారు.ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు, ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందామని, ఏపీలోని ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని, కాబట్టి ప్రజలంతా మళ్లీ తమ నాయకత్వాన్ని కోరుకుంటారని జగన్ బలంగా నమ్ముతున్నారు.
ఇదే విషయాన్ని పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన గ్రాఫ్ బాగుందని ఎమ్మెల్యేలు మరింతగా పెంచుకోవాలని, సర్వేల్లో గెలుస్తారు అనుకున్న వారికి టిక్కెట్ ఇస్తామని, ప్రజా బలం లేని వారిని పక్కన పెడతామని పదేపదే జగన్ శతబోధ చేస్తున్నారు.

ఇక తాను నేరుగా జనాల్లోకి వెళ్ళకపోయినా, ప్రజలంతా వైసిపి వైపే ఉన్నారని నమ్ముతున్నా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలను జగన్ ప్రస్తావిస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేగా ఉందని, జగన్ అనుకున్నంత ఈజీగా గెలుపు ఉండదనే అభిప్రాయం వైసిపి ఎమ్మెల్యేలు, నాయకుల్లోనే వ్యక్తం అవుతుంది.టిడిపి బలహీనమైన విషయం వాస్తవమైనా, తమ అధినేత జగన్ అనుకున్నంత స్థాయిలో అయితే బలపడలేదని , క్షేత్ర స్థాయిలో టిడిపి క్యాడర్ బలంగా ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కొన్ని వివాదాస్పద నిర్ణయాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో ఆ పార్టీ సక్సెస్ అయిందని వైసీపీ నాయకులే చెబుతున్నారు.అంతేకాకుండా పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు బాగా పెరిగిపోయాయని , ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని, వైసిపి నాయకుల్లోనే ఈ తరహా అభిప్రాయాలు ఉన్నాయి.2019 మాదిరిగానే ఫలితాలు వస్తాయనే ధీమా అధినేత జగన్ లో కనిపిస్తున్నా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేది ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు.