జనసేన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీలో కలిసి ముందుకు వెళుతున్నాయి.అప్పుడప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ, సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, విడివిడిగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వీరి మధ్య మాత్రం ఇంకా పొత్తు కొనసాగుతూనే ఉంది.
ఒకరి అవసరం మరొకరికి ఉండడం, 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని రెండు పార్టీలు చూస్తూ ఉండడం, రెండు పార్టీలు కలిసి ముందుకు వెళితేనే అధికారం దక్కించుకోగలము అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి కారణాలతో ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి.ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించుకుని ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తున్నాయి.
అయితే పొత్తు పెట్టుకున్న తర్వాత ఏపీలో జనసేన బీజేపీని పట్టించుకోనట్టు వ్యవహరించింది.
కనీసం కేంద్ర బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా పవన్ కు దక్కలేదు.
అయినా ఆ పార్టీతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నారు.ఒకరి అవసరం మరొకరికి ఉండడంతో పాటు, జనసేన కు ఆర్థికంగా, రాజకీయంగా బీజేపీ అండదండలు తప్పనిసరిగా ఉండాల్సి రావడంతో పవన్ ను అవమానాలకు బీజేపీ గురిచేస్తున్నా, తట్టుకుంటూనే వస్తున్నారు.
అది కాకుండా , తన రాజకీయ బద్ధ శత్రువు అయిన జగన్ తో బీజేపీ చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నా, పవన్ అయిష్టంగానే బీజేపీతో కొనసాగుతున్నారు.ఈ ప్రయాణం ఇలా ఉండగానే, జనసేన పార్టీ పై బీజేపీకి ఓ పెద్ద డౌట్ వచ్చినట్లుగా కనిపిస్తోంది.

తమతో కలిసి పవన్ రాజకీయంగా బలపడితే, 2024 ఎన్నికల సమయానికి పవన్ తమకు అండగా నిలబడతాడా లేదా అనే డౌట్ అప్పుడే బీజేపీ పెద్దలకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే పవన్ వైఖరిలో మార్పు కనిపించడం, ఒంటారిగానే అమరావతి లో పోరాటం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వంటి వ్యవహారాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది.తమ అండదండలతో పవన్ ఏపీలో క్షేత్రస్థాయిలోనూ బలపడి మరింత బలం పెంచుకుంటే, వచ్చే ఎన్నికల్లో తమకు కాకుండా, తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు చూస్తోందట.
ఈ మేరకు పవన్ టిడిపి వైపు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయంపైన విశ్లేషణ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.2014 ఎన్నికల సమయం నుంచి చూసుకుంటే పవన్ టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, వైసీపీ పై విమర్శలు చేశారు.
అలాగే టీడీపీ బీజేపీ పొత్తు తెగతెంపులు అయిన తర్వాత పవన్ బీజేపీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం వంటి పరిణామాలు అన్నిటిని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటూ, జనసేనపై అనుమానాలు పెంచుకుంటూ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ అనుమానాలు మరింతగా బహిర్గతం అయితే, ఈ రెండు పార్టీల పొత్తుకు మధ్యలోనే బ్రేకులు పడే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి.