ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఎన్నికల్లో నాలుగు సీట్ల కోసం కమలం బాబులూ…బాబు పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది.ఏదో బాబు పై ప్రేమతోనో, లేక ఆంధ్ర పై అభిమానంతోనో కాదు అన్న విషయం ఆ పార్టీ నేతల ప్రవర్తన చూస్తేనే ఇట్టే అర్ధం అయిపోతుంది.
అయితే పాపం చంద్రబాబు మాత్రం తనకు కేంద్రం అండ ఉంటుంది అన్న బ్రమలోనే ఇంకా ఉన్నారు.ఇక అదే అదునుగా కేంద్రం తమ చేతికి మట్టి అంటకుండా ప్రతీ పనిలో మెల్లగా పక్కకు తప్పుకుంటుంది.
ఇక ఎంసెట్ విషయానికే వస్తే దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు రాజకేయ వర్గాల్లో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.ఎంసెట్ వివాదం రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిందేనని… ఇంకా వారివల్ల కాకపోతే సెటిల్ చేయాల్సిన బాధ్యత గవర్నరుదేనని ఆయన తేల్చేశారు.
అంతేకాదు, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుంటే రాష్ట్రాల వ్యవహారాల్లో తలదూరుస్తుందన్న అపవాదు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.ఒకవేళ రెండు రాష్ట్రాలూ వచ్చి అడిగితే అప్పుడు ఆలోచించొచ్చంటున్నారాయన.
అందులోనూ తననేమైనా ఇన్వాల్వ్ చేస్తారేమోనన్న బెంగతో ఆయన కేంద్రం ఎంటరైనా కూడా ఇది హోం మంత్రే ఇలాంటివి చూడాలంటూ పక్కకు తప్పుకున్నారు.మరి మిగిలిన సమయాల్లో బాబును పొగిడేస్తూ తన భుజాలపై ఎక్కుంచుకు తిరిగే వెంకయ్య ఏపీ కోసం ఈ విషయంలో ఏమీ చేయలేరా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ వ్యవహారంతో ఇక మీదట కేంద్రం బాబు సర్కార్ కు మొండి చెయ్యే చూపిస్తుంది అని స్పష్టంగా అర్దం అవుతుంది.