పౌరసత్వ బిల్లు: అమిత్ షాపై ఆంక్షలు విధించాలన్న అమెరికా కమిషన్

భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే.

సోమవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుధీర్ఘంగా ఏడు గంటల పాటు చర్చ జరిగింది.

ఈ క్రమంలోనే మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పిస్తున్న ఈ బిల్లుపై కొన్ని రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ నిరసన సెగలు అమెరికాకు తాకాయి.

పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) తీవ్రంగా మండిపడింది.భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుని తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా అభివర్ణించింది.

మతం ఆధారంగా రూపొందించిన ఈ బిల్లు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కమిషన్ మండిపడింది.

Advertisement

భారతదేశ లౌకిక చరిత్రకు, రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన సమానత్వపు హక్కుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని యూఎస్‌సీఐఆర్ఎఫ్ అభిప్రాయపడింది.శరణార్థుల్లో ముస్లింలు కాని వారికి భరోసా ఇవ్వడం సరిగా లేదని కమిషన్ పేర్కొంది.ఇదే సమయంలో లోక్‌సభలో బిల్లు పాస్ కావడం పట్ల యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ బిల్లు గనుక భారత పార్లమెంట్‌లో ఆమోదం పొందినట్లయితే హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలపై ఆంక్షల్ని విధించే అంశాన్ని పరిశీలించాలని ఫెడరల్ ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.కాగా కమిషన్ వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.ఇదే సమయంలో యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ వాదన అసమంజసం, అవాస్తవమని పేర్కొంది.

మతపరమైన మైనారిటీ శరణార్థుల కష్టాలను తొలగించడం, వారి మానవ హక్కులను గౌరవించడమే ఈ బిల్లు ఉద్దేశ్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు.ఇదే సమయంలో పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ చురకలంటించింది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు