కరోనా సంక్షోభంలో ఉపాధి లేకపోవడంతో పేదల పరిస్ధితి దారుణంగా తయారైంది.రెక్కాడితే కానీ డొక్కాడనీ వీరికి పూట గడవటం కూడా కష్టమైంది.
ఈ క్రమంలో కొన్ని కోట్ల మంది ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలను చూసి తమిళనాడుకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక చలించిపోయింది.తన చదువు కోసం దాచుకున్న రూ.5 లక్షలను తండ్రితో ఖర్చు చేయించి సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు పొందింది.ఇప్పుడు ఆమె మంచి మనసును ఐక్యరాజ్యసమితి సైతం మెచ్చుకుంది.
అంతేకాకుండా ఐరాస అనుబంధ సంస్ధ UNADAPకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
వివరాల్లోకి వెళితే.
మధురైకి చెందిన సీ.మోహన్ దాస్ సెలూన్ షాపును నిర్వహిస్తున్నాడు.ఇతనికి భార్య, నేత్ర అనే కుమార్తె ఉంది.బిడ్డను ఉన్నత చదువులు చదించాలనే ఉద్దేశ్యంతో మోహన్ రూ.5 లక్షలు కూడబెట్టాడు.అయితే కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.
దీంతో పేదల ఆకలి కేకలతో దేశం కంటతడి పెట్టింది.నిత్యం టీవీ, వార్తా పత్రికల్లో వీరి కష్టాన్ని చూసిన నేత్ర.తన చదువు కోసం దాచిన రూ.5 లక్షలను పేదల కోసం వెచ్చించాలని నేత్ర తండ్రిని కోరింది.బిడ్డ మంచి మనసును ప్రశంసించిన మోహన్‌దాస్… కుమార్తె కోరిక మేరకు పేదలకు నెల రోజుల పాటు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసి వారి ఆకలిని తీర్చారు.

ఈ విషయం ప్రధాని నరేంద్రమోడీ దాకా వెళ్లడంతో గత ఆదివారం ‘‘మన్ కీ బాత్’’ కార్యక్రమంలో మోహన్, నేత్రల మానవతా దృక్పథాన్ని, సేవలను మోడీ ప్రశించారు.ఈ వ్యవహారం ఖండంతరాలు దాటి ఐక్యరాజ్యసమితికి చేరింది.నేత్ర ఉదారత, దాతృత్వాన్ని కొనియాడటంతో పాటు ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది.
ఐరాస అనుబంధ సంస్ధ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ పీస్ (యూఎన్ఏడీఏపీ)కి గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్‌గా నియమిస్తున్నట్లుగా ప్రకటించింది.అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసగించే అవకాశం కల్పించింది.
దేశవిదేశాల నాయకులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు పేదలకు సాయం చేసే దిశగా పురికొల్పేందుకు నేత్ర ప్రసంగం తోడ్పాటును అందించనుంది.ఇక ఐరాసతో పాటు నేత్ర పెద్దమనసును గుర్తించిన డిక్సన్ స్కాలర్‌షిప్ రూ.లక్ష ఉపకార వేతనాన్ని ప్రకటించింది.