ఏందిరయ్యా ఇది చీర కట్టుకుని ఆఫీస్ కి వస్తే ఇన్ని పాట్లుంటాయా.మరి నేనేంది తొమ్మిదినెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఒంటికి పట్టేసినట్టుండే డ్రెస్ల కంటే చీరలే కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను.
ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఫ్లోర్ల పైనుండే ఆఫీస్ కి వెళ్లాను.రెండు ఫ్లోర్ల పై నుండే మా పోర్షన్ కి చీరతోనే కదా వెళ్తున్నాను.
నేనే కాదు నాకు ఊహ తెలిసినప్పటినుండి నా చుట్టు ఉన్నవాళ్లు చీరనే కట్టుకుంటున్నారు.ఊర్లో ఉండే మా అత్తమ్మ చీర కట్టుకునే వ్యవసాయం చేస్తుంది.
ఉద్యోగం చేసే మా అమ్మ చీర కట్టుకునే తన పని చేసుకుంటుంది.మా ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఇంటి పట్టునే ఉండే వాళ్లు కూడా చీరలోనే తమ కుటుంబాన్ని చూసుకుంటున్నారు.
ఇన్ని పనులకు ఇంతమందికి అడ్డం పడని చీర మీకెలా అడ్డమనిపించిందిరా బాబూ….మారిన పరిస్థితులకు తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులొచ్చి రకరకాల బట్టలొచ్చాయి కానీ చీరల్లో కానీ,చీర కట్టులో కానీ మార్పు రాలేదే….
ఇప్పుడు చీర టాపిక్ ఎందుకంటే …ఏదో ఛానల్ వాడు లైఫ్ తక్ అనే ప్రోగ్రామట.ఆడవాళ్లు చీర కట్టుకుని ఆఫీస్ కి వస్తే ఇన్ని పాట్లుంటాయి అని ఒక వీడియో తీసి దాన్ని ట్వీట్ కూడా చేసాడు.
ఆ వీడియో మీరే చూడండి…
చూసారు కదా.దీనిపై నెటిజన్లంతా రకరకాలుగా మండిపడుతున్నారు.ఒకరు హిందుత్వం మీద బురదంటాడు.ఇక్కడ మతమో,కులమో టాపిక్కే కాదు.భారతీయ సంప్రదాయం అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చీరకట్టు గురించే.చిట్టి పొట్టి బట్టలేసుకునే విదేశీయులు కూడా ఇండియా రాగానే ఇక్కడ చీరకట్టుకి ఫిదా అయిపోయి చీర కట్టుకుని మురిసిపోయిన సంధర్బాలు బోలెడు.
ఇకపోతే ఆ వీడియోలు చూపించినట్టు మెట్లెక్కడానికి ఇబ్బంది,బాత్రూంకి పోవడానికి ఇబ్బంది అంటే ఒప్పుకుంటా ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.ఏం చుడిదార్లు వేసుకున్నప్పుడు ఆ చున్నిని ఇటు సర్దుకుని అటు సర్దుకుని ఇబ్బందులు పడ్డవారి గురించి మీకు తెలుసా.
ఎప్పుడూ అలవాటు లేని జీన్స్ మొదటి సారి వేసుకోగానే ఇబ్బంది పడ్డ సంధర్బాలు ఎప్పుడూ చూడనట్టు .చీర కడితేనే ఈ సమస్యలు అని కొత్తగా చెప్పొద్దు.
ఆ వీడియోలో ఇంకో విషయం ఏంటంటే స్కిన్ షో అట.చీర కడితే శరీరం అంతా కనపడుతుంది.మగవాళ్లు చూస్తారనేది సారాంశం.నిండా బట్టలు కట్టుకుంటే మగవాళ్లు చూడరా.చూడాలనుకునేవాడు ఒంటి నిండా దుప్పటి కప్పుకున్నా చూస్తాడు.ఎలాంటి బట్టలేసుకున్నా చూస్తాడు.
ఆడవాళ్లు సరిగా బట్టలేసుకోరు కాబట్టే ఈ అత్యాఛారాలు అంటారు.నువ్వేమో చీరకట్టుకుంటేనే స్కిన్ షో అంటున్నావ్.
ఇప్పటి వరకు అత్యాఛారాలు జరిగిన అమ్మాయిలందరూ బట్టల్లేకుండా తిరగడం వలన జరిగాయా.లేకపోతే చీరకట్టుకుని స్కిన్ షో చేయడం మూలంగా జరిగాయా.
కనీసం తమకు నచ్చిన బట్టలేసుకునే స్వేఛ్చ లేకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కొత్త రాధ్దాంతం ఏందిరయ్యా.సరే మీరన్నట్టే చీర స్కిన్ షో అనుకుందాం.
అది మీకు సినిమాల్లో చూపించినట్టు సగం ఒళ్లు బయటపెట్టుకుని ఎవరూ కట్టుకోరు భయ్యా.అది కేవలం స్త్రీల అందంతో చేసే బిజినెస్ మాత్రమే .మీ ఇంట్లో అమ్మా,భార్య,అక్కా ,చెల్లి కట్టుకునే చీరకట్టులో అంత వల్గారిటి ఎప్పుడైనా చూసావా .లేదు కదా…మరి ఎలా అంటావ్ రా చీర కడితే స్కిన్ షో అని…నిన్ను ,నీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోలేకనే నిందలు ఆడవాళ్ల బట్టలపైన వేస్తున్నావ్.ఆ విధంగా చూడడం అనేది మనిషి మానసిక బలహీనత.
ఫైనల్ గా మన దేశంలో చాలా మంది చీరలు కట్టుకుని గొప్పగొప్ప పనులు చేసిన వాళ్లున్నారు యుద్దభూమిలో ఝాన్సీ రాని,వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు మహిళ,తెలంగాణాసాయుధపోరాటంలో మల్లు స్వరాజ్యం,చాకలి ఐలమ్మ…రాజకీయాల్లో ఇందిరా గాంధీ, బృందాకరత్,సుష్మా స్వరాజ్,సోనియా గాంధి.
మారథాన్ లో పాల్గోన్న సంపత్ జయకుమార్.వీళ్లందరూ చీరకట్టుకునే ఇవన్నీ చేసారు,చేస్తున్నారు.అంతెందుకు 1936 లో సరళ థక్రల్ అనే మహిళా ఫైలట్ ఏకంగా చీరకట్టుకునే ఎయిర్ క్రాఫ్ట్ నడిపింది.వీరందరూ చేసిన పనులకంటే కష్టతరమైందా సాఫ్ట్ వేర్ ఉద్యోగం.
ఇన్ఫోసిస్ అధినేత సుధా మూర్తి కట్టుకునేది చీరలే.ఈ వీడియో తీసినవాళ్లకు తెలీదేమో పాపం.
అయినా కల్చరల్ డేలు అంటూ కాలేజ్ లలో,సాఫ్ట్వేర్ కంపెనీలలో చీరలు కట్టుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి.వాటికి అటెండ్ అవుతున్న వాళ్లందరూ చీరకట్టుకుని సంతోషంగానే అటెండ్ అవుతున్నారే…అసలు ఈ వీడియో తీసినవాడి స్ట్రాటెజీ ఏంటో నాకైతే అర్దం కావట్లే.
మీకేమన్నా అయిందా…