తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానికి పెద్ద సవాల్‌గానే మారింది.ఇదిగో అదిగో పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తయిందనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినబడుతునే ఉన్నాయి.
తీరా ఈ నెలలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపిక ఉంటుందనే తరుణంలో మాజీమంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి ఎంటరవడంతో పీసీసీ ఎంపిక ప్రక్రియ ఇంకాస్త వెనుక్కు వెళ్లింది.
ముందు నుంచి పీసీసీ ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్‌లో గందరగోళమే నడుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైందని ఒక పక్క.మరోపక్కనేమో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కి ఇలా మరి కొంత మంది పేర్లు వినిపించాయి.
చివరకు అనూహ్యంగా పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి పేరు, ప్రచారకమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా శ్రీధర్‌బాబు పేర్లు తెరమీదకు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
పేర్లు ఖరారై ఇక ప్రకటన వెలువడే క్రమంలో సీన్‌లోకి జానారెడ్డి ఎంటరవడంతో పీసీసీ ఎంపిక ప్రక్రియ మరింత వెనక్కువెళ్లింది.
పీసీసీ ఎంపిక ప్రక్రియను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తరువాతనే ప్రకటించాలని అధిష్టానికి జానారెడ్డి విన్నవించారు.సాగర్ ఉప ఎన్నికలో తాను పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానికి చెప్పినట్లు తెలిసింది.
అంతేకాకుండా ఉప ఎన్నికకు ముందే టీపీసీసీ ఎంపిక జరిగితే దాని ఫలితం తన గెలుపుపై ప్రభావం చూపుతుందని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది.

గత సాధారణ ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గమే అక్కడి రాజకీయాల్లో ముందునుంచి చక్రం తిప్పుతోంది.అయితే గత ఎన్నికల్లో బీసీ నేత నోముల చేతిలో జానారెడ్డి ఓటమిపాలయ్యారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీసీల ఓట్లే సుమారు 50 వేల వరకు ఉంటాయి.ఇలాంటి తరుణంలో పీసీసీ ఎంపిక జరిగితే అది సామాజిక రాజకీయ సమీకరణాలకు దారితీసి తన గెలుపుపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుందనే ముందస్తు అంచనాకు జానారెడ్డి వచ్చినట్లు తెలిసింది.
ఇదే విషయాన్ని అధిష్టానానికి జానారెడ్డి చెప్పి పీసీసీ ప్రకటనను ఉప ఎన్నిక తరువాత వాయిదా వేయించి తన గెలుపుకు మార్గం సుగమం చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీంతో ఉప ఎన్నిక జరిగిన తరువాతే పీసీసీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.