వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగానే మారుతోంది.అతి తక్కువ సమయంలోనే ఎన్నో సంచలన పథకాలు, నిర్ణయాలు తీసుకుని జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.
అదే సమయంలో జగన్ దూకుడు నిర్ణయాలు వివాదాస్పదం అవుతూ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్నాయి.తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కు బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సమర్ధించడంపై ఇప్పుడు ఎక్కడలేని రచ్చ జరుగుతుంది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియం లో చదువుకునేలా చేస్తానని జగన్ చెప్పారని, ప్రజల కొరికే మేరకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, ఇందులో తప్పేముంది అంటూ యార్లగడ్డ సమర్ధించుకోవడంపై ఆయన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి.
గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా అర్బన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు.అయితే ఈ నిర్ణయాన్ని అప్పట్లో హిందీ అకాడమీ ఛైర్మెన్ గా ఉన్న యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు.
అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం సరికాదని, ఇంగ్లిష్ బాషా బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు పాఠశాలల్లో లేరంటూ యార్లగడ్డ వివాదం లేవదీశారు.అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంపై తెలుగు బాషా అభిమానులు మండిపడుతున్నారు.‘అన్న మా బిడ్డలకు ఇంగ్లిష్ రాకపోతే మేమెట్లా బతుకుతాం.మేమెట్టా పోటీని తట్టుకుంటాం’ అని మొరపెట్టుకున్నారని , అందుకు జగన్ ‘నేనున్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారని యార్లగడ్డ తనను తాను సమర్ధించుకుంటూ జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు.

ప్రస్తుతం రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండి కూడా యార్లగడ్డ ఈ విధంగా వ్యవహరించడం ఆయన మీద విమర్శలు పెరిగిపోతున్నాయి.గత టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా ఆంగ్ల భాష ప్రవేశపెట్టడంపై 2018 జూన్ 30 న విశాఖలోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు.వంటి మీద ఉన్న చొక్కాను సైతం విప్పేసి నిరసన చేపట్టారు.తెలుగు భాషకు పట్టిన దుస్థితిపై నేను సిగ్గుపడుతున్నా అంటూ అప్పట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
అయితే ఇప్పుడు అదే నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంటే అడ్డుకోవాల్సిన యార్లగడ్డ జగన్ నిర్ణయాన్ని సమర్ధించడమే కాకుండా ప్రజల అభీష్టం మేరకే ఇలా చేస్తున్నారు అని చెబుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు భాషకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు అంటూ యార్లగడ్డ సమర్దించడంపై తెలుగు భాషాభిమానులు మండిపడుతున్నారు.