అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుండటం.ఓవర్ డోస్ కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రభుత్వం డ్రగ్స్ ముఠా ఆటకట్టించేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో బుధవారం ఆర్కాన్సాస్‌లో మూడు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.దీనిని అక్టోబర్ నెలలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్ ఇది.ఈ ఏడాది జూన్ నుంచి ఎఫ్‌బీఐ, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో పాటు లిటిల్ రాక్ ఫీల్డ్ పోలీసులు సంయుక్తంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.

పలువురు ఏజెంట్లు క్లిప్టన్ విలియమ్స్, డెస్మండ్ కెల్లీ, మోంటారియో పుల్లర్ వంటి మాదక ద్రవ్యాల రవాణా సంస్థల్లోకి ప్రవేశించి.ఈ ముఠాల అనుపానులను కనుగొన్నారు.ఈ మూడు సంస్థలు పంపిణీ చేసిన ఓపిడియం, ఫెంటానిల్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లుగా దర్యాప్తులో తేలింది.
అధిక నాణ్యత, తక్కువ ధరతో వస్తున్న హెరాయిన్, ఫెంటానిల్ కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారని తద్వారా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ స్కాట్ రీన్హార్ట్ తెలిపారు.మాదక ద్రవ్యాల ముఠాను పట్టుకునేందుకు గాను లిటిల్ రాక్ ఫీల్డ్ ఆఫీసులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.
జూన్ నుంచి జరిగిన ఆపరేషన్‌లో 1,600 గ్రాముల ఫెంటానిల్, 5 వేల ఫెంటానిల్ మాత్రలు, 21,000 గ్రాముల మెథామ్ఫెటామైన్, 53 వేల గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.