అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల తంతు ముగిసింది.ఈరోజు ఎన్నికల ఫలితం వెలువడబోతుండడంతో, పూర్తిగా ఇప్పటివరకు సాగిన ఉత్కంఠకు తెరపడబోతోంది.
ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలన్నీ గట్టి ప్రయత్నాలు చేశాయి.భారీగా సొమ్ములు ఖర్చుపెట్టి మరి జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాయి.
ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడమే కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపునకు ఈ ఉప ఎన్నికలు సంకేతం అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాయి.అందుకే గెలుపు కోసం అన్ని పార్టీలు చేయని ప్రయత్నాలు లేవు.
ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నెన్నో రాజకీయ వ్యవహారాలను అమలు చేశాయి.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తమ ఖాతాలో వేసుకోవాలని టిఆర్ఎస్ బిజెపిలు ప్రయత్నాలు చేశాయి.
అయితే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని, మళ్ళీ గెలుస్తామని ఆ పార్టీలో కనిపించింది.కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ పోటీ చేయగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తోపాటు అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలు ఉన్నారు.
ఈరోజు మధ్యాహ్నం 1:00 సమయానికి ఎన్నికల ఫలితాలు వెలువడబోతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఇక్కడ తామే గెలుస్తామని కాంగ్రెస్ ,టిఆర్ఎస్ బిజెపి ఆశలు పెట్టుకున్నాయి.
అయితే సైలెంట్ గా సాగిన ఓటింగ్ ప్రక్రియ ఎవరికి అనుకూలంగా మారింది అనేది ఆసక్తి కలిగిస్తుంది.

ముఖ్యంగా పోలింగ్ రోజు చివరి మూడు గంటల్లో జరిగిన ఓటింగ్ అందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఎక్కువగా హైదరాబాద్ నుంచి మునుగోడు ఓటర్లు తరలిరావడంతో వారంతా ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనే ప్రచారం అన్ని ప్రధాన పార్టీలను కలవరానికి గురిచేస్తున్నాయి.తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు ఈ ఉప ఎన్నిక ఫలితం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక్కడ గెలిస్తే దేశ వ్యాప్తంగా తమకు తిరుగు లేదని సంకేతాలను కేసీఆర్ ఇవ్వడంతో పాటు తెలంగాణలోనూ మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలుగా మునుగోడు ఎన్నికల ఫలితాన్ని చూపించాలని కేసీఆర్ తాపత్ర పడుతున్నారు.ఇక బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది .గతంతో పోలిస్తే ఆ పార్టీ బలం పుంజుకుని టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది.కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో గెలిచి రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆశలు పెట్టుకుంది.
అయితే ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ బిజెపి మధ్య జరిగినట్లు అనేక సర్వే సంస్థలు తమ రిపోర్టులను బయట పెట్టడంతో, రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్టుగా తేలింది .అయితే కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా జనాలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని చెబుతోంది.ఇక అన్ని పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా టిఆర్ఎస్ కు ఎన్నికల గుర్తులు చేటు తెస్తాయని బిజెపి కాంగ్రెస్ లు అంచనా వేస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్నికల ఫలితం ఈరోజు వెలువడబోతుండడంతో ఇక్కడ గెలిచే పార్టీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దక్కుతుంది అనే విషయం మాత్రం జనాల్లోకి వెళ్తోంది.