ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పాట ఏదన్నా ఉంది అంటే అది బుల్లెట్ బండి పాట అనే చెప్పాలి.సాధరణంగా ఆడపిల్ల పుట్టింటి వాళ్ళని వదిలి మెట్టినింటికి వెళ్లేటప్పుడు ఎంతో బాధ పడుతూ కన్నీరు పెట్టుకుంటుంది.
కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం కాస్త వెరైటీగా పెళ్లి కూతురు గెటప్ లో రోడ్డు మీద డాన్స్ చేసింది.మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రీయ ట్రేండింగ్ లో ఉన్న గాయని మోహన భోగరాజు పాడిన బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా పాటకు తనదైన శైలిలో భర్త ముందు స్టెప్స్ వేసి భర్తను ఆశ్చర్య పరిచింది.
పాటకు తగ్గట్టుగా డాన్స్ చేసి తన భర్తకు పాటను గిఫ్ట్ గా ఇచ్చింది.ప్రస్తుతం సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
పెళ్లి కూతురు భలే డ్యాన్స్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.అసలు వివరాల్లోకి వెళితే ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ కు ఇచ్చి వివాహం నిర్వహించారు.
పెళ్లి తంతు కార్యక్రమం లో భాగంగా అప్పగింతల సమయంలో కన్నీళ్లు పెట్టుకోకుండా వధువు మాత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తూ డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో ఈ వీడియోను వీక్షించారు.
సాయి శ్రీయ కూడా అనుకోలేదట ఈ డాన్స్ ఇంత పాపులర్ అవుతుందని.ప్రస్తుతం వధువు సాయి శ్రీయ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తుండగా, వరుడు అశోక్ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.ఇదిలా ఉండగా మరోవైపు కరీంనగర్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి.నరహరి ఈ పాటపై స్పందిస్తూ పెళ్లి కూతురు నూతన వరుడి కోసమే అలా డ్యాన్స్ చేసింది.ఎంతో ఆనందంతో పెళ్లి కూతురు అతన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తోంది.కల్మషము లేని ప్రేమ అతడి బుల్లెట్టు బండిపై సవారీ చేయాలనుకుంటోంది’ అని సోషల్ మీడియా వేదికగా తెలియ చేశాడు.