టిడిపి చంద్రబాబు ప్రాతినిధ్యం కుప్పం నియోజకవర్గంలో పరిస్థితిలో ఇంకా సద్దుమణిగినట్టు కనిపించడం లేదు.గత మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య భౌతిక దాడులు, విమర్శల హోరు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.అయినా టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగిస్తూ ఉండడం, వైసిపి ప్రభుత్వం ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా, తాము వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా బాబు వ్యవహరిస్తూ కుప్పంలోనే మఖం వేశారు.
దీంతో గత మూడు రోజులుగా ఇదే రకమైన హైటెన్షన్ కనిపిస్తూనే ఉంది.ఇక వైసిపి టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ ఉండడం వంటివి మరింతగా ఇక్కడ వ్యవహారాన్ని వేడెక్కిస్తున్నాయి.
ఇప్పటికే రామకప్పంలో ఐదు , కుప్పంలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో 59 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరు కేసులను పోలీసులు నమోదు చేశారు.ఇక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వైసిపి కీలక నాయకులపై కేసులు నమోదు చేశారు.307 ,353,332,143,147,148,506436, ఐపిసి సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసి సెక్షన్లను ఈ కేసుల్లో పెట్టారు.ఈ కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.మీరే దాడులకు దిగి మీరే కేసులు పెడతారా ఇదెక్కడి అరాచకం ఆయన మండిపడుతున్నారు.ఈ వ్యవహారాలతో వైసిపి పతనం ప్రారంభమైందని, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని బాబు హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యవహారంపై వైసీపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టిడిపి ఘోరంగా ఓటమి చెందడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, ఏదో ఒక అలజడి సృష్టించి కుప్పంలో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సైతం ఎమ్మెల్యేగా గెలవలేరు అంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఇక ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
వైసిపి కార్యకర్తలు వాళ్ళ ఇంటిపై పార్టీ జెండాలు కట్టుకుంటే బాబుకు ఎందుకు బాధ అంటూ అంబటి ప్రశ్నిస్తున్నారు.మంగళగిరిలో లోకేష్ జెండా పీకేసారని, కుప్పం లో కూడా బాబు జెండా పీకడం ఖాయమని రాంబాబు ఎద్దేవా చేశారు.







