అధికారం లేనప్పుడు తులసి చెట్టు లా చిన్నగా ఉండే కాంగ్రెస్( Congress Party ) ఒక్కసారి అధికారం వస్తే మాత్రం మర్రి చెట్టులా మారుతుంది అన్న నానుడిని కర్ణాటక ఎన్నిక పలితాలతో కాంగ్రెస్ మరోసారి రుజువు చేస్తుంది .రాజకీయ చాణక్యుడు కేసీఆర్( KCR ) నాయకత్వంలో ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ లో అధికారం అందిపుచ్చుకున్న భారతీయ రాష్ట్ర సమితి ముచ్చటగా మూడవసారి పోటీలో నిలబడింది.
స్వతహాగా రైతు అయిన కేసీఆర్ తెలంగాణలో అనేక సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చి అపర భగీరధుడిగా పేరు తెచ్చుకున్నారు.అంతేకాకుండా తెలంగాణలో దళిత బంధు, రైతుబంధు తో పాటు రుణమాఫీ అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలకు తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా మార్చారు.
అంతేకాక మరోవైపు ఆర్థిక అభివృద్ధిలో కూడా దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణను నిలబెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.దాంతో మూడోసారి విజయ దుందిభి మోగించి హ్యాట్రిక్ కొడతారంటూ వార్తలు వినిపించాయి.దానికి తగ్గట్టే ఎన్నికల లక్ష్యం గా తెలంగాణ ప్రజలకు అనేక వరాలను ప్రకటించిన కేసీఆర్ ప్రత్యర్థుల కన్నా ముందే అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించి ఎన్నికల సంగ్రామంలో చాలా ముందుకు దూసుకెళ్లారు.అయితే బారాస వేగంతో పోల్చి చూసినప్పుడు మొదట్లో కాంగ్రెస్ కొంత వెనకబడినట్టు కనిపించినప్పటికీ తరువాత అన్ని శక్తులను పుంజుకుని బారాస కు గట్టి పోటీ ఇచ్చే దిశగా కాంగ్రెస్ ముందుకొచ్చింది.
ముఖ్యంగా కాంగ్రెస్ ను వీడి వెళ్లిన కీలక నాయకులను తిరిగి పాత గూటికి రప్పించడం లో టి .కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సఫలమయ్యారు.
కేసీఆర్ వ్యతిరేకులకు కాంగ్రెస్ను వేదికగా నిలబెట్టగలిగారు.దాంతో ప్రత్యర్ధి పార్టీల నుంచి కాంగ్రెస్ కు భారీగా వలసలు పెరుగుతున్నాయి.భాజపా నుంచే కాకుండా అధికార బారాస నించి కూడా టికెట్టు పై హామీ దక్కని నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తలుపు తడుతున్నారు.దాంతో గెలుపు గుర్రాలను పోటీకి నిలబెట్టడం ఇప్పుడు కాంగ్రెస్కు సులువైనదనే చెప్పాలి.
నిన్న మొన్నటి వరకు బారాస వైపు కొంత మొగ్గు ఉన్నట్టు కనిపించినా ప్రస్తుతం కాంగ్రెస్ -బారాస ల బలాబలాలు సమాన స్థాయిలో కనిపిస్తున్నాయి.మరి ఎన్నికలు కనుచూపుమేరలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఏ పార్టీ విజయ లక్ష్మీ వైపు ఒక అడుగు ముందుకు వేస్తుంది అన్నది వేచి చూడాలి.