టిడిపి అధినేత చంద్రబాబు చాలాకాలం తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో 53 రోజులపాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు.
గతంలో షరతులతో కూడిన బెయిల్ ఆయనకు మంజూరైనా, తరువాత హైకోర్టులో ఆయనకు ఎటువంటి కండిషన్ లేకుండా బెయిల్ మంజూరు కావడం , చంద్రబాబు రాజకీయ సమావేశాలు, సభల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కసరత్తు మొదలుపెట్టారు .ఇది ఇలా ఉండగా రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. నవంబర్ 27న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదైన సిద్ధార్థ లుద్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కి చంద్రబాబు హాజరుకానున్నారు.
సీనియర్ న్యాయవాదిగా ఉన్న లుద్ర చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు.
అంతేకాదు ప్రస్తుతం చంద్రబాబు కేసులు అన్నటిని లుద్ర నే వాదిస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి లుధ్ర కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.
ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాదు నుంచి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు.అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్ లో జరిగే రిసెప్షన్ కు హాజరవుతారు .ఆ తర్వాత మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకుంటారు.ఇక మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జరగనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది .

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, నవంబర్ 21న ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ కేసుకు సంబంధించి తగిన సాక్షదారాలు సమర్పించినా, తమ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .ఈ నేపథ్యంలో దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.అయితే చంద్రబాబు తన ఢిల్లీ టూర్ లో బిజెపి కేంద్ర పెద్దలను ఎవరినైనా రహస్యంగా కలుస్తారా అనే విషయం పైన వైసిపి ఆరా తీస్తోంది.