తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోంది.తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నియామకం జరిగిన దగ్గర నుంచి ఈ సంక్షోభం మరింత ముదిరింది.
ఈ కమిటీలలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటూ కాంగ్రెస్ సీనియర్లు ప్రత్యేకంగా సమావేశం కావడం, పార్టీ మారేందుకు కూడా వెనకాడబోము అనే సంకేతాలు ఇవ్వడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగమేగాల మీద ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ను రంగంలోకి దించింది.తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై అసంతృప్తులకు గల కారణాలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే సీనియర్లు దిగ్విజయ్ సింగ్ వద్ద తమ ఆవేదనను వెలగెక్కారట.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మాకు వద్దని, ఆయనను మార్చాలంటూ డిమాండ్ చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాణిక్యం ఠాగూర్ వ్యవహరిస్తున్నారని, రేవంత్ రెడ్డి తన ఒక్కడి కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని, ఏఐసీసీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని , పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగానే మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని వారు దిగ్విజయ్ సింగ్ కు చెప్పారట.
తమకు ముందస్తు సమాచారం అందించకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారట.తప్పనిసరి పరిస్థితుల్లోనే తామంతా తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారట.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కారణంగా పార్టీ ఇలా తయారయ్యింది అని, ఆయనను వెంటనే మార్చాలని సీనియర్లంతా తేల్చి చెప్పారట.

దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ ఆయన్ని బాధ్యతలు నుంచి తప్పించేందుకు ఏఐసీసీకి నివేదిక ఇస్తానంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం.ముఖ్యంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క దామోదర రాజనర్సింహ జగ్గారెడ్డి జీవన్ రెడ్డి వి హనుమంతరావు రేణుక చౌదరి పొన్నం ప్రభాకర్ శంకర్రావు బలరాం నాయక్ జానారెడ్డి మహేశ్వర్ రెడ్డి మధు ఎస్కే గౌడ్ తో పాటు అనేకమంది దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారట.అయితే వీరితో పాటు సమావేశంలో పాల్గొన్న మంతాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంపత్ కుమార్ వంటి నేతలు తటస్థంగా వ్యవహరించారట.
ఎక్కువమంది మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి పై ఫిర్యాదు చేయడం తో ఆయన్ను మారిస్తే కొంతవరకు సీనియర్లు సంతృప్తి చెందుతారనే అభిప్రాయానికి దిగ్విజయ్ సింగ్ వచ్చారట.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.తగిన ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని, పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారని, పార్టీని వీడి వెళ్లిన వారంతా రేవంత్ వ్యవహార శైలి కారణంగానే బయటకు వెళ్లిపోయారని సీనియర్లు ఫిర్యాదు చేశారట.ఈ సందర్భంగా కాంగ్రెస్ కీలక నేతలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారట.
గ్రూపు రాజకీయాలతో పార్టీ నాశనం చేయొద్దని సూచించారట.అందరూ సఖ్యతగా వ్యవహరిస్తూ.
పార్టీని అధికారంలోకి తీసుకురావాలని , మిగతా అన్ని సంగతులు తాము చూసుకుంటామని ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చి అసంతృప్త నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారట.