ఈరోజుల్లో చిన్నతనంలోనే మొబైల్ ఫోన్లకు బాలబాలికలు అలవాటుపడుతున్నారు.వీరు పొద్దస్తమానం ఫోన్ లతోనే గడిపేస్తూ చివరికి తమ తల్లిదండ్రులకు గుండెలదిరేలా చేస్తున్నారు.
తెలిసోతెలియకో వీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోలేక తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
సిడ్నీకి చెందిన ఐదేళ్ల బాలుడు టెట్రిస్ గేమ్ ఆడుతూ ఉబర్ ఈట్స్ అనే యాప్ లోకి వెళ్లి 1200 ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైన ఐస్ క్రీంలు, కేకులు ఆర్డర్ చేశాడు.
సాధారణంగా గేమ్స్ ఆడుతూ ఉంటే ఏదో ఒక యాడ్ మధ్యమధ్యలో ప్లే అవుతుంటుంది.
బహుశా ఆ విధంగా బాలుడు ఓ ప్రకటనపై క్లిక్ చేసి ఉంటాడు.అలా ఆ పిల్లోడు గేమ్ లో నుంచి నేరుగా ఉబర్ ఈట్స్ యాప్ కు వెళ్ళాడు.
అక్కడ తనకు నచ్చిన మెస్సినా ఫ్లేవర్ ఐస్ క్రీంలు, కూల్ కేకులు ఆర్డర్ చేశాడు.కొన్ని గంటల తరువాత మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అయిందని ఊబర్ ఈట్స్ నుంచి మెసేజ్ రావడం చూసి బాలుడు తండ్రి అవాక్కయ్యాడు.
తర్వాత అసలు విషయం తెలుసుకొని తలపట్టుకున్నాడు.
బాలుడు తండ్రి అగ్నిమాపక విభాగంలో పనిచేస్తున్నాడు.
అయితే పెద్ద మొత్తంలో కేకులు ఆఫీస్ కు రావడంతో ఏం చేయాలో తెలియక వాటన్నిటినీ అక్కడి సిబ్బందికే పంచి పెట్టేసాడు.

ఈ బిల్లు ఖరీదు మన కరెన్సీలో అక్షరాలా రూ.65,220. జోక్ ఏంటంటే ఈ బిల్లు ఆ పిల్లాడి కంటే పొడవుగా ఉందట.
ఈ ఘనకార్యం చేసిన పుత్ర రత్నం గారిని తండ్రి ఎలా మందలించాడో మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఈ విషయాన్ని ఐస్‌క్రీమ్ గెలాటో మెస్సినా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వెల్లడించింది.
బాలుడు తెలియక ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో వాటిని తండ్రి ఆఫీసులో ఉబర్ ఈట్ డెలివరీ చేసిందని ఆ పేజీ వివరించింది.దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
చిన్న పిల్లలకు ఫోన్ లు ఇస్తే వారిని పర్యవేక్షించాలని.లేదంటే ఇలాంటి షాకులే తగులుతాయని హితబోధ చేస్తున్నారు.