ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు ఉన్మాదుల చేతుల్లో బలైపోతున్నారు.కుటుంబానికి ఆసరాగా వుంటాడనుకున్న వారు కానరాని లోకాలకు తరలిపోతుండటంతో కన్నవారు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్ధి దారుణహత్యకు గురయ్యాడు.వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ (26) అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో రెండేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం తన మిత్రుడిని విమానాశ్రయంలో దించి ఇంటికి వస్తున్న సాయిచరణ్ కారుపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్.ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సాయిచరణ్ ప్రాణాలు కోల్పోయాడు.
అతని మరణవార్తను అమెరికా అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు.కొడుకు ఇకరాడని తెలిసి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మరోవైపు… సాయిచరణ్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించాల్సిందిగా తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
ఇకపోతే.ఏడాది క్రితం జరిగిన భారత సంతతి వ్యాపారవేత్త హత్య, దోపిడీ కేసును అమెరికా పోలీసులు ఛేదించారు.దీనికి సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్‌లోని లిండెన్‌హర్ట్స్‌కు చెందిన కిన్‌షుక్ పటేల్ అనే వ్యక్తిని తన సొంత స్టోర్‌లోనే కత్తితో నరికి చంపి, ఆపై నగదును దోచుకెళ్లారు దుండగులు.ఏడాది తర్వాత ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డబ్ల్యూసీబీఎస్ టీవీ గురువారం కథనాన్ని ప్రసారం చేసింది.
దీనిపై కిన్‌షుక్ పటేల్ బంధువు సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.డిటెక్టివ్‌లకు ధన్యవాదాలు తెలిపారు