సిక్కు మతానికి ఎనలేని సేవ చేస్తున్న సింగపూర్‌కి చెందిన భారత సంతతి వ్యక్తి అమర్‌దీప్ సింగ్‌కు 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘‘ది గురునానక్ ఇంటర్‌ఫెయిత్ ప్రైజ్’’ లభించింది.న్యూయార్క్‌లోని వుడ్‌బరీలో నవంబర్ 14న అవార్డును అమర్‌దీప్‌కు ప్రదానం చేయనున్నారు.
మతపరమైన అవగాహనను పెంచడానికి ప్రయత్నించే వారికి ప్రతి రెండేళ్లకు ఒకసారి న్యూయార్క్‌లోని హాఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయం ఈ అవార్డును అందజేస్తుంది.పురస్కారం కింద 50,000 డాలర్ల రివార్డును కూడా బహూకరిస్తారు.
న్యూయార్క్‌లోని బ్రూక్‌విల్లేలో ఇషార్ బింద్రా అతని కుటుంబ సభ్యులచే 2006లో ఈ అవార్డు నెలకొల్పబడింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించిన అమర్‌దీప్ సింగ్, ఆయన భార్య వినిందర్ కౌర్‌తో కలిసి సింగపూర్‌లో స్ధిరపడ్డారు.
లాస్ట్ హెరిటేజ్ ప్రొడక్షన్స్ పేరిట విజువల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నారు.చరిత్ర గతిలో కలిసిపోయిన వారసత్వాల పరిశోధన, డాక్యుమెంటేషన్‌పై వీరిద్దరూ పనిచేస్తున్నారు.‘లాస్ట్ హెరిటేజ్, ది సిక్కు లెగసీ ఇన్ పాకిస్థాన్’ , ‘ది క్వెస్ట్ కంటిన్యూస్: లాస్ట్ హెరిటేజ్, ది సిక్కు లెగసీ ఇన్ పాకిస్థాన్’ అనే పేరుతో అమర్‌దీప్ పుస్తకాలను రచించారు.
డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో చదువుకున్న ఆయన చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.25 ఏళ్లు ఆర్ధిక సేవల విభాగంలో పనిచేసిన అమర్‌దీప్… క్రెడిట్ కార్డ్ వ్యాపారం యొక్క రెవెన్యూ నిర్వహణ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి నేతృత్వం వహించాడు.పాకిస్తాన్‌లోని సిక్కు వారసత్వ అవశేషాలపై కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలను కూడా తీశారు.
భారత్, పాకిస్తాన్‌లకు చెందిన వాలంటీర్లకు నాయకత్వం వహించి ‘Allegory, A Tapestry of Guru Nanak’s Travels’ అనే డాక్యుసిరీస్‌ను రూపొందించాడు.

కాగా… దాదాపు 550 సంవత్సరాల క్రితం గురునానక్ ‘‘సృష్టిలో ఏకత్వం ’’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి 22 ఏళ్ల పాటు యాత్రలు చేశారు.ఈ క్రమంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టిబెట్, బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక వంటి దేశాలలో పర్యటించారు.21వ శతాబ్ధంలో దేశాల మధ్య భౌగోళిక , రాజకీయ ఆంక్షల కారణంగా గురునానక్ సందర్శించిన ప్రదేశాలను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆయన పర్యటించిన ప్రాంతంలో దాదాపు 70 శాతం ప్రదేశాలను చిత్రీకరించడం కూడా కష్టమే.







