2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అన్ని రకాలుగా అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు. న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.
ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
దీంతో బిన్‌లాడెన్, అల్‌ఖైదాలపై పగబట్టిన అమెరికా.ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.
పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్‌లోని అబోట్టాబాద్‌లో లాడెన్‌ను హతమార్చింది. 9/11 దాడులు జరిగి నేటీకి 20 ఏళ్లు గడిచాయి.
కానీ ఈ సమయంలో అమెరికా సాధించింది శూన్యం.ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఆఫ్ఘన్, ఇరాక్‌లపై ప్రతీకార దాడులకు దిగిన అగ్రరాజ్యం.
ఒట్టి చేతులతోనే ఆఫ్ఘన్‌ను వీడగా, మరికొద్దిరోజుల్లో ఇరాక్‌లోనూ బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది.
ఇక ఈ సంగతి పక్కనబెడితే.9/11 దాడుల తర్వాత అమెరికన్ల దృక్పథంలో మార్పు వచ్చింది.పాస్‌పోర్ట్‌లో ముస్లిం అని వుంటే చాలు.
వారిపై దాడులకు దిగడమో, హతమార్చడమో జరిగింది.ఈ కోవలో భారత సంతతికి చెందిన సిక్కులు కూడా బాధితులుగా మారారు.
ట్విన్ టవర్స్‌పై దాడుల తర్వాత సిక్కులు జాతి విద్వేష దాడులకు లక్ష్యంగా మారారని అమెరికన్ పంజాబీ అసోసియేషన్ నేతలు అంటున్నారు.ఈ సందర్భంగా నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.
ఎఫ్‌బీఐ రికార్డులలో సిక్కులపై కొన్ని ద్వేషపూరిత నేరాలు వున్నాయన్నారు.గుర్తింపులో లోపాల కారణంగా తరచుగా సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని పరిష్కరించాల్సిన సిక్కు కమ్యూనిటీ నాయకులు అంతర్గత కలహాలతో బిజీగా వున్నారని.దాని గురించి ఆలోచించడానికి వారికి తగిన సమయం లేదని ఆయన చురకలు వేశారు.
దీని వల్ల సిక్కులు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తున్నారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తర్న్ తరణ్‌కు చెందిన సిమ్రత్ పాల్ సింగ్ మే 3, 2019న లా పాజ్ కౌంటీ జైలులో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కస్టడీలో మరణించారని చాహల్ గుర్తుచేశారు.కానీ ఎన్‌ఏపీఏ మినహా దేశంలోని మరే ఇతర సిక్కు సంస్థ కూడా దీనిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.సిక్కు మత గురువుల భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికాలోని అన్ని సిక్కు సంస్థలు, గురుద్వారాల మేనేజింగ్ కమిటీలు ప్రచారాన్ని ప్రారంభించాలని చాహల్ సూచించారు.