తెలుగు దేశం పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కోస్తా ప్రాంతంలో తప్ప.రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఎక్కువగా వైకాపా బలం కనిపించింది.
ఒక్క అనంతపురం మినహా మిగిలిన సీమ జిల్లాల్లో జగన్ వర్గం ఎక్కువగా ఉండడం చేత అక్కడ తెలుగు దేశానికి పెద్దగా వచ్చింది ఏమీ లేదు అనే చెప్పుకోవాలి.అయితే అదే కారణమో లేక వేరే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయో తెలీదు కానీ ముఖ్యమంత్రి చంద్ర బాబు మాత్రం రాయల సీమ విషయంలో ఒకింత భాద్యతా రాహిత్యంతోనే ప్రదర్శిస్తున్నారు అంటున్నారు సాక్షాత్తూ రాయల సీమ తెలుగు దేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు.
ఒక పక్క సీమాంధ్రను సింగపూర్ చేస్తాను అంటూ, కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల పైనే దృష్టి సారించిన చంద్రబాబు రాయల సీమకు రావాల్సిన ప్రాజెక్టులు, కేటాయించాల్సిన నిధుల విషయంలో మాత్రం పెద్దగా ఆలోచన చేయడం లేదు అనేది రాయల టీడీపీ నేతల వాదన.మరో పక్క సొంత పార్టీ నేతలు, మంత్రులు సైతం సభలో చంద్రబాబు ప్రవర్తనపై కొంచెం గుర్రుగా ఉన్నట్లు, ఆయన పద్దతి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, అంతా తానై వ్యవహరిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి సైతం సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక దీనినే అలుసుగా తీసుకుని వైకాపా తెలుగు దేశాన్ని దెబ్బ తీసే దిశలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మరి అసలే అనేక ఇబ్బందులు ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ విమర్శలను, వ్యూహాలను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.







