తెలంగాణ ఫైర్ బ్రాండ్ , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.మొదటి నుంచి కేటీఆర్, కేసీఆర్ వ్యవహారాలపై దృష్టి పెడుతూ, వారిపై విమర్శలు చేస్తూ వస్తున్న రేవంత్, ప్రజల్లో వారి బలం తగ్గించి, కాంగ్రెస్ పుంజుకునే విధంగా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో తమకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా, రాజకీయంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు , భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది.
దీంతో ఇప్పటి వరకు వేల కోట్లు ఖర్చు పెట్టి జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేసామని గొప్పగా చెప్పుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి వరదలు కోలుకోలేని నష్టాన్ని కలిగించాయి.
దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండడంతో, ఆ పార్టీకి టెన్షన్ పెరిగిపోతుండడంతో పాటు, తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూస్తోంది.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిని టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు.ఈరోజు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని వరద బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కేటీఆర్, కేసీఆర్ లను ఉద్దేశించి రేవంత్ ఘాటు విమర్శలు చేశారు.వరద బాధితుల కోసం 500 కోట్లు కేటాయించి, 250 కోట్లు ఆ పార్టీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని విమర్శించారు.
ఎల్బీనగర్, కూకట్ పల్లి, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ లకు వివరాలు ఇచ్చి మరి ఫిర్యాదు చేశానని , నిజమైన లబ్ధిదారులకు సహాయం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేశామంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
అలాగే శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ అపాయింట్మెంట్ తీసుకున్నానని , సోమవారం ఆఫీస్ కి వస్తాను అని చెప్పానని, అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అధికారి మాత్రం జీహెచ్ఎంసీ నుంచి పారిపోయాడు అని, ఒక మహిళా అధికారిని మాత్రం ఇక్కడకు పంపించారు అని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా కేసీఆర్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.” సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జులాయి మంత్రి, పేద ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ పార్టీ నాయకులు బస్తీలో తిరగాలి.వరద సహాయం కోసం ఇచ్చిన పదివేల డబ్బుల్లో టిఆర్ఎస్ నాయకులు 5000 కొట్టేసారు.బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే కొట్టేసేందుకు ఇబ్బంది అవుతుందని ఓట్లు కొనుగోలు చేయడానికి నగదు బదిలీ పథకం పెట్టారు అంటూ మండిపడ్డారు.
బిజెపి, టిఆర్ఎస్ నేతలు కలిసి డబ్బులు పంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.8860 కోట్ల నష్టం జరిగిందని ప్రధాని మోదీకి చెప్పారు.మీరు ఇచ్చిన 500 కోట్లు ఏమేరకు సరిపోతాయి ? నిజమైన లబ్దిదారులకు పైసలు అందలేదు.టిఆర్ఎస్ దొంగలకు మాత్రం డబ్బులు వెళ్ళాయి అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.