రఘనందన్ రావు పేరు వింటేనే చాలు బీజేపీ నేతల్లో కొత్త జోష్ నెలకొంటుంది.అంతలా తన మాటలతో రఘనందన్ రావు ఎదుటి వారిని ఆకర్షిస్తాడు.
అంతే కాకుండా తన మాటలతో ప్రత్యర్థులను కూడా డిఫెన్స్ లో పడేసే శక్తి రఘనందన్ రావు సొంతం.మొన్న దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హావాను తట్టుకుని గెలిచి… రాష్ర్ట నాయకులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు తన వైపు చూసేలా చేశాడు.
టీఆర్ఎస్ పార్టీ నేతలపై నిత్యం విరుచుకుపడే ఈ బీజేపీ నేత ఎల్లప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
రఘునందన్ రావు తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లోనే ఉండేవారు.
కానీ తర్వాత జరిగిన పరిణామాలతో అతడు కాషాయ కండువా కప్పుకున్నాడు.తనకు రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్ పార్టీపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాడు.
తాజాగా బీజేపీ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్ కు రఘునందన్ రావు చేదోడు వాదోడుగా ఉంటూ… ఆయన వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారట.టీఆర్ఎస్ పార్టీని తట్టుకుని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు తెర వెనుక భారీ ప్లాన్ సిద్ధం చేశాడట.
ఈటల నియోజకవర్గంలో జరిగే ప్రతి సభకూ ఆయన హాజరవుతూ… బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు.

ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ లోనే ఉన్న రఘునందన్ రావుకు మాజీ మంత్రి తాజాగా బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తో సత్సంబంధాలు ఉన్నాయి.ఉద్యమ కాలం నుంచే ఇరువురు నేతలు ఒకరితో ఒకరు స్నేహ పూర్వకంగా ఉండేవారు.రఘునందన్ రావు టీఆర్ఎస్ ను వీడి కాషాయ కండువా కప్పుకున్న తర్వాత కూడా ఏనాడు ఈటల రాజేందర్ ఆయనను విమర్శించలేదు.
సీఎంని, మంత్రి కేటీఆర్ ను తూర్పార పట్టే రఘునందన్ రావు కూడా వైద్య మంత్రిగా ఇన్నాళ్లు సేవలందించిన ఈటల రాజేందర్ ను పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం.