ఎపీకి ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజీ గానీ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.శంకుస్థాపనకు వచ్చి ఉత్త చేతులు చూపించాడని దుయ్య పడుతున్నాయి.
టీడీపీ నాయకులకు కూడా ఈ విషయంలో కోపంగానే ఉంది.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, హిందూపురం ఎమ్మెల్యే, సినిమా హీరో బాలకృష్ణ మొదలైన వారు తమ కోపం వెళ్లగక్కారు.
జయదేవును బాబు పిలిపించి మందలించారు.బాలకృష్ణను ఏమన్నారో తెలియదు.
చాలా మంది టీడీపీ నాయకులకు మోడీపై కోపం ఉండొచ్చు.కానీ బయటపడటం లేదు.
పదవులు లేని కొందరు నాయకులు బాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి హోదా తప్పకుండా వస్తుందని ఊదరగొడుతున్నారు.అలాంటి వారిలో ముద్దు కృష్ణమ నాయుడు ఒకరు.
ఒకప్పుడు టీడీపీలో ఉంది మంత్రి పదవులు అనుభవించిన ముద్దు కృష్ణమ తరువాత కాగ్రెస్ లో చేరి బాబును యమ తిట్లు తిట్టారు.వై ఎస్ ఆర్ చనిపోయాక కాంగ్రెస్ లో తన పప్పులు ఉడకవని భావించి మళ్ళీ టీడీపీ లోకి దూకారు.
నగరి నుంచి పోటీ చేసి వై కా పా అభ్యర్థి, మాజీ హీరోయిన్ రోజా చేతిలో ఓడిపోయారు.ఇక అప్పటి నుంచి బాబు భజన బాగా చేస్తున్నారు.
తెలంగాణా ఏర్పాటుకు టీడీపీ అసలు మద్దతు ఇవ్వనే లేదని అడ్డంగా వాదించారు.ఇటువంటి ముద్దు కృష్ణమ మోడీ ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తారని చెబుతున్నారు.
రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేయాలో మోడీకి తెలుసని చెప్పారు.ఈ విషయంలో టీడీపీని విమర్శించే నైతిక హక్కు వై కా పాకు, కాంగ్రెస్ కు లేవట.
అవి కళంకిత పార్టీలని విమర్శించారు.ఆర్టీసీ మీద అప్పుల భారం తగ్గించడానికే ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచిందట.
ఈయన బస్సుల్లో ప్రయాణం చేయరు కాబట్టి ఆ భారం ఏమిటో తెలియదు.పదవులు లేని నాయకులు తమకు బోరు కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు.