ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.అప్పుడే ఎన్నికలు వచ్చేసి నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.
గతంతో పోలిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ యాక్టివ్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల పేరుతో పట్టు పెంచుకుంటూ హడావుడి చేస్తుండగా, బిజెపి సైతం ఇక్కడ గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయినట్టు గా కనిపిస్తోంది.
అయితే ఇదంతా త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు ఉండడంతో, ఇక్కడ బలం నిరూపించుకోవడానికి రాబోయే ఎన్నికలకు బాట వేసుకోవచ్చు అనే ఆలోచనతో, అన్ని పార్టీలు ఇప్పటి నుంచే తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ రేసులో యాక్టివ్ గా ఉన్నట్టుగా కనిపించిన జనసేన ఇకపై మరింత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ 17 ,18 తేదీలలో మంగళగిరి కేంద్రంగా అనేక కార్యక్రమాలను రూపొందించుకున్నారు.
ఇక్కడ పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించడం తో పాటు , అమరావతి లో రాజధానికి అనుకూలంగా ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రైతుల తోనూ భేటీ కాబోతున్నారు.
ఇక్కడే పవన్ రాజకీయ వ్యూహానికి తెర తీసినట్టుగా కనిపిస్తున్నారు.ముఖ్యంగా తమతో పొత్తు పెట్టుకున్న బిజెపి అమరావతి వ్యవహారంలో ఎప్పుడో చేతులెత్తేసింది.పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఇష్టమని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని క్లారిటీ ఇచ్చేసింది.అయితే అప్పటి వరకు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలబడిన పవన్ కు ఈ వ్యవహారం లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం అర్థం కాలేదు.
అదే సమయంలో పవన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.కొద్దిరోజులు హడావిడి చేయడం , ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టడం పవన్ కు అలవాటుగా మారిందని రాజకీయ విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీంతో బిజెపి కలిసి వచ్చినా , రాకపోయినా కొన్ని కొన్ని వ్యవహారాలలో స్వతంత్రంగానే వ్యవహరించాలని పవన్ డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.అది కాకుండా చాలా వ్యవహారాలలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ముఖ్యంగా వైసీపీ విషయంలో వారు సానుకూలంగా ఉండడం, ఆ పార్టీని, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ వస్తుండడం , వంటివి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి.అయినా పవన్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.కానీ ఇది రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.దీనికి తోడు జనసైనికులలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.పవన్ సినిమా మొగ్గుచూపుతున్నారు తప్ప పార్టీని పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం పార్టీలో రావడం ఇలా ఎన్నో రకాల అసంతృప్తులు పెరిగిపోతుండడంతో, పవన్ ఏపీ పై ఫోకస్ పెంచే అంశంలో భాగంగా రెండు రోజులపాటు ట్రైల్ రన్ వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.