ఎన్ఆర్ఐ విద్యార్ధులను ఆకర్షించేందుకు గాను పంజాబ్ విశ్వవిద్యాలయం వినూత్నంగా ఆలోచించింది.వర్సిటిలో ఉన్న ప్రతి హాస్టల్లో ఎన్నారై విద్యార్ధులకు గదులను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎన్ఆర్ఐ విద్యార్ధులకు ఇలాంటి సదుపాయం లేదు.ప్రస్తుతం వర్సిటీ క్యాంపస్లో పురుషులకు 8, మహిళలకు 9 చొప్పున మొత్తం 17 హాస్టల్స్ ఉన్నాయి.
ఎమాన్యుయెల్ నహర్ నేతృత్వంలోని హాస్టల్ వార్డెన్లతో కూడిన పీయే డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ (డీఎస్డబ్ల్యూ) కమిటీ సమావేశంలో గదుల రిజర్వేషన్లకు సంబంధించి సిఫారసు చేసింది.ఎన్ఆర్ఐ విద్యార్ధులు చదువుకునేందుకు, స్కాలర్షిప్ అదుకునేందుకు పంజాబ్ విశ్వవిద్యాలయం అనుమతిస్తుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్ధుల కోసం వర్సిటీ 220 సీట్లను కేటాయించింది.ప్రతి హాస్టల్లో ఒకటి లేదా రెండు గదులను ఎన్ఆర్ఐ విద్యార్ధులకు, అంతర్జాతీయ హాస్టల్లో 15 నుంచి 20 సీట్లను వచ్చే సెషన్ నుంచి రిజర్వ్ చేసుకోవాల్సిందిగా తాము సూచించినట్లు ఓ కమిటీ సభ్యుడు తెలిపారు.
ఎన్ఆర్ఐలతో పాటు విదేశీ విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు హాస్టల్ నెంబర్ 10లోనూ కొన్ని సీట్లను విదేశీ విద్యార్ధులకు కేటాయించాలని ప్యానెల్ సూచించింది.డీఎస్డబ్ల్యూ చీఫ్ నహర్ మాట్లాడుతూ.చాలా మంది ఎన్ఆర్ఐ విద్యార్ధులకు అడ్మిషన్ పొందిన తర్వాత హాస్టల్లో రూమ్ దొరకడం లేదు.
దీంతో తాము సిఫారసు చేయాల్సి వచ్చిందని, ఈ విధానం వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నహర్ తెలిపారు.కాగా ఎన్ఆర్ఐలు, విదేశీ విద్యార్ధుల హాస్టల్ ఫీజు విధివిధానాలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
అయితే దీనికి వర్సిటీ ఉపకులపతి రాజ్ కుమార్ ఆమోదం లభించాల్సి ఉంది.గత కొన్ని సంవత్సరాల నుంచి హాస్టల్ ఫీజు పెంపు లేనందున ఈ ఏడాది దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.