ఓలా రైడ్ బుక్ చేసే యూజర్లకు ఆ కంపెనీ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.ఇకపై రైడ్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అవ్వకుండా ఓ పరిష్కారం కనిపెట్టినట్టు ఓలా సంస్థ వెల్లడించింది.
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఓలా బుక్ చేస్తే ఒక్కోసారి రైడ్ సక్సెస్ అయితే మరోసారి క్యాన్సిల్ అవుతుంది.ఈ సమస్య వల్ల చాలామంది యూజర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు.
క్యాబ్ బుక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెప్పగానే డ్రైవర్లు రావొచ్చు, రాకపోవచ్చు.ఒక్క హైదరాబాద్ లోనే ప్రతిరోజు సుమారు 30 వేల వరకు ఓలా రైడ్స్ రద్దు అవుతున్నాయి.
ఈ గణాంకాలు రైడ్ క్యాన్సిల్ సమస్యకు అద్దం పడుతున్నాయి.అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో సమాలోచనలు చేసిన ఓలా ఓ కొత్త పరిష్కారం కనిపెట్టింది.
సాధారణంగా యూజర్లు ఓలా రైడ్ బుక్ చేసినప్పుడు.గమ్యస్థానం ఏంటి? ఎలాంటి పేమెంట్ మెథడ్ యూజ్ చేస్తారు అనే తదితర విషయాలు డ్రైవర్లకు తెలియవు. దీనివల్ల డ్రైవర్ రైడ్ రద్దు చేసే అవకాశాలు ఎక్కువ.అయితే ఇలా కాకుండా ఇకపై ఎవరైనా యూజర్ ఓలాలో రైడ్ బుక్ చేస్తే వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే గమ్యస్థానం డీటెయిల్స్‌ను డ్రైవర్లకు తెలియజేయడానికి సిద్ధమైంది ఓలా. దీనివల్ల ఒక రైడ్ రిక్వెస్ట్ రాగానే డ్రైవర్లు సమాచారం అంతా తెలుసుకొని రైడ్ తీసుకుంటారు లేదా వదిలేస్తారు.అప్పుడు వేరొక డ్రైవర్ రైడ్ ను టేకప్ చేస్తాడు.
దీనివల్ల రైడ్ బుక్ కావడం.మళ్లీ అది క్యాన్సిల్ కావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

డ్రైవర్లకు యూజర్ల డ్రాపింగ్ లొకేషన్ ముందే తెలియజేయడంతో పాటు యూజర్ నగదు రూపంలో చెల్లిస్తారా? యూపీఐ పేమెంట్ చేస్తారా? లాంటి విషయాలు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని ఓలా యోచిస్తోంది.ఇలా చేయడం వల్ల రైడ్ క్యాన్సిల్ అయ్యే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం అని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు.

అయితే ఇలా ముందుగానే డ్రైవర్లకు యూజర్ల సమాచారం తెలియజేస్తే రైడ్ బుకింగ్స్ మరింత ఎక్కువగా రద్దయ్యే అవకాశం లేకపోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రాత్రి సమయాల్లో ఎవరైనా యూజర్ చాలా దూరంలో ఉన్న గమ్యస్థానానికి తీసుకువెళ్లాలని రైడ్ బుక్ చేస్తే.డ్రైవర్లు ఆ రైడ్ ను క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోలేదు.అలాగే నగదు రూపంలో పేమెంట్ చేయకుండా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న యూజర్ల బుకింగ్ ని కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువ.
రిటర్న్ లేని సుదూర ప్రాంతాల రైడ్ కూడా ఎక్కువగా క్యాన్సిల్ అవుతాయి.అతి తక్కువ దూరంలోని గమ్యస్థానాలకు కూడా ఓలా డ్రైవర్లు రాకపోవచ్చు.ఇంతకు ముందు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే డ్రైవర్లు ఇప్పుడు ఫోన్ చేయకుండానే ఓలా రైడ్ క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నెటిజన్లు.మరి ఓలా ఈ సమస్యను సమర్థవంతంగా ఎలా పరిష్కరిస్తుంది చూడాలి.